Fri Dec 05 2025 09:28:58 GMT+0000 (Coordinated Universal Time)
Nallari Kiran Kumar Reddy : నల్లారిలో నిరాశ.. ఇక ఇన్నింగ్స్ ముగిసినట్లేనా?
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎలాంటి పదవులు లేకుండా సాగిపోతున్నారు

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎలాంటి పదవులు లేకుండా సాగిపోతున్నారు. ఆయన బీజేపీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ దాదాపు పదేళ్ల నుంచి పదవులకు దూరంగా ఉంటున్నారు. చిన్న వయసులోనే రాజకీయాల్లో పదవులకు దూరంగా ఉండటం కష్టమే. రాష్ట్ర విభజనతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలు గ్యాప్ ఇచ్చిగ్యాప్ ఇచ్చి మరీ పార్టీలు మారినా ఫలితం లేకుండా పోతుంది. దీంతో నల్లారి అనుచరులు ఆందోళన చెందుతున్నారు. సొంతపార్టీ పెట్టుకున్నప్పటికీ ప్రజలు ఆదరించలేదు. కాంగ్రెస్ లోకి వెళ్లినా అక్కడా ఎలాంటి పదవులు దక్కలేదు. చివరకు బీజేపీలో చేరి ఎంపీ అవ్వాలన్న కల కూడా నెరవేరలేదు.
పదేళ్ల నుంచి పదవి లేకుండా...
2014 నుంచి ఐదేళ్ల పాటు విరామం తీసుకున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ కాంగ్రెస్ కు ఏపీలోనూ, దేశంలోనూ బలోపేతం కాదని భావించిన నల్లారి వెనువెంటనే తన డెసిషన్ ను మార్చుకున్నారు. ఇక తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీలో చేరడంతో మాజీ ముఖ్యమంత్రిగా గౌరవించిఆయన కోరుకున్న రాజంపేట లోక్ సభ నియోజకవర్గం సీటు ఇచ్చింది. కానీ కూటమి పార్టీలకు అన్ని చోట్ల విజయం దక్కినా, రాజంపేటలో మాత్రం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు. రాజంపేటలో ఓటమిని నల్లారి తట్టుకోలేకపోయారు. దీంతో ఆ నియోజకవర్గానికి కూడా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక ఇదే సమయంలో రాజ్యసభ పదవి అయినా దక్కుతుందని నల్లారి భావించారు.
బీజేపీలో కనుచూపు మేరలో...
కానీ బీజేపీ కేంద్ర నాయకత్వం మాత్రం కొత్తగా చేరిన వారికి పదవులు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందులోనూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గత ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చినందున ఇక మరో పదవికి ఆయన పేరును పరిశీలనలోకి తీసుకునే ఛాన్స్ కూడా లేదని తెలిసింది. దీంతో ఆయన బీజేపీలో ఉన్నప్పటికీ సైలెంట్ గానే ఉన్నారు. ఎలాంటి పదవి లేకపోవడంతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఎప్పటిలాగానే హైదరాబాద్ కే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు బీజేపీ కార్యక్రమాలకు వస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో రాజకీయాలకు ఆయన సిద్ధంగా లేరని తెలుస్తోంది. దీంతో నల్లారిలో నిరాశ ఆవరించింది. వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియవు. దీంతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇక రాజకీయాలకు దూరంగా ఉంటే మేలన్న సూచనలు సన్నిహితుల నుంచి వినిపిస్తున్నాయి. అందుకే ఆయన ఏపీ రాజకీయాల గురించి కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారట. ఎదురు చూపులు చూడటం తప్ప ఆయన చేయగలిగిందేమీ లేదు.
Next Story

