Fri Feb 14 2025 11:43:54 GMT+0000 (Coordinated Universal Time)
Election Stratagists : వ్యూహకర్తలు లేకపోతే ఇక కష్టమేనా? అవసరమా? అపనమ్మకమా?
ఎన్నికలు జరుగుతున్నాయంటే వ్యూహకర్తల అవసరం ప్రతి పార్టీకి ఉంటుంది.

ఎన్నికలు జరుగుతున్నాయంటే వ్యూహకర్తల అవసరం ప్రతి పార్టీకి ఉంటుంది. రాజకీయాల్లో డక్కామొక్కీలు తిన్న పార్టీ అధినేతలు, అనుభవం, వ్యూహాలలో పేరున్న వారు కూడా ఎన్నికల వ్యూహకర్తలపైనే ఆధారపడుతున్నారు. అంటే వీరి ప్లానింగ్ సక్రమంగా లేకనా? జనం నాడి గతంలో మాదిరిగా పట్టుకోలేకపోతున్నారా? జనరేషన్ గ్యాప్ తో ఈ సమస్య వచ్చిందా? అన్న ప్రశ్నలు పక్కన పెడితే ఎన్నికల్లో అన్ని పార్టీలకూ స్ట్రాటజిస్టుల అవసరం మాత్రం ఉందని అంటున్నారు. అందుకోసం వందల కోట్ల రూపాయలు వెచ్చించడానికి కూడా పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇది ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని అన్ని పార్టీల పరిస్థితి అలాగే ఉంది. పశ్చిమ బెంగాల్ లోమమత బెనర్జీ కూడా శాసనసభ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ను ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుని మూడోసారి విజయం సాధించారు.
గతంలో మాదిరిగా...
గతంలో నేతలు ఒక అంచనా వేసేవారు. నియోజకవర్గాల వారీగా నేతలను ఎంపిక చేసేవారు. దానికి అనేక పద్ధతులను పాటించేవారు. సామాజికవర్గంతో పాటు ధనంతో పాటు పట్టు నేతలకు ఉందా? అని పరిశీలన చేసి టిక్కెట్లు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు జనం మూడ్ మారింది. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఎవరిని తమ నేతగా భావిస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. సంక్షేమ పథకాలతో పాటు చేసిన అభివృద్ధి కూడా ఏ మాత్రం పనిచేయడం లేదని గతకొన్ని ఎన్నికల ఫలితాలు తేల్చిచెప్పాయి. జనం మూడ్ ను బట్టి అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది. అది ఒక్కరి వల్ల కాదు. అందుకు టీం అవసరం. సర్వేలు అంతే ముఖ్యం. జనాభిప్రాయానికి అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేస్తే అధికారానికి దగ్గరవుతామన్న నమ్మకం ఇటీవల పార్టీ నేతల్లో పెరిగిపోయింది. అందుకే ఎన్నికల వ్యూహకర్తలకు డిమాండ్ పెరిగిపోయింది. ప్రశాంత్ కిషోర్ అందుకున్న వరస విజయాల తర్వాత ఈ ట్రెండ్ మరింత ఎక్కువయింది. తెలుగు రాష్ట్రాల ఎన్నికలను కూడా పరిశీలిస్తే ఇది మరింత అర్థమవుతుంది.
ఎన్నికల్లో గెలిపించ గలిగితే...
2024 ఎన్నికల్లో రాబిన్ శర్మ తెలుగుదేశం పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఇక ప్రశాంత్ కిషోర్ టీం నుంచి వచ్చిన రుషిరాజ్ ఐప్యాక్ టీంకు సారథ్యం వహించి వైసీపీ వ్యూహకర్తగా నిలిచారు. రాబిన్ శర్మ షో టైమ్, రుషిరాజ్ ఐప్యాక్ టీంలతో తాముచేయాల్సిందంతా చేశారు.అభ్యర్థులఎంపిక నుంచి సోషల్ మీడియాలో ప్రత్యర్థిపార్టీలపై విమర్శలు, సొంత పార్టీ మ్యానిఫేస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి పనులు చేశారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో రాబిన్ శర్మ ఏక్ నాథ్ షిండే కోసం, నరేష్ అరోరా అజిత్ పవార్ కోసం పనిచేశారు. రెండుపార్టీలను విజయం వైపు నడిపించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ తరుపున సునీల్ కనుగోలు పనిచేశారు. కానీ ఫలితం కనిపించ లేదు. తెలంగాణ, కర్ణాటక ఎన్నికల్లో సక్సెస్ అయిన సునీల్ కనుగోలు మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి అధికారాన్ని సాధించిపెట్టలేకపోయారు. అంతెందుకు ఎంతమందినో ముఖ్యమంత్రులను చేసి, దేశంలోనే వ్యూహకర్తగా పేరున్న ప్రశాంత్ కిషోర్ మొన్నటి ఉప ఎన్నికల్లో బీహార్ లో తమ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపి గెలిపించుకోలేకపోయారు.
అన్ని సార్లు పనిచేయవుగా......
నరేష్ అరోరా టీం గత ఎన్నికల్లో నెల్లూరు వైసీపీఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డికి పనిచేసినా అనుకూల ఫలితం రాలేదు. అంటే ఒక విషయం మాత్రం అర్థమవుతుంది. కేవలం వ్యూహకర్తలతోనే గెలవాలనుకుంటే కుదరదని కూడా ఎన్నికల ఫలితాలు తేల్చిచెప్పాయి. అలాగే వ్యూహకర్త లేకుండా ఎన్నికలకు వెళ్లడం కూడా కష్టమే.గతంలో ఎవరూ ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకో లేదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండుసార్లు కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చినప్పుడు ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకోలేదు. అలాగే చంద్రబాబు నోటి నుంచి కూడా 2009 ఎన్నికల వరకూ ఎన్నికల వ్యూహకర్త అనే మాట వినిపించేది కాదు. కానీ వైఎస్ జగన్ వైసీపీ పెట్టిన తర్వాత, లోకేష్ టీడీపీలో క్రియాశీలం అయిన తర్వాత మాత్రమే స్ట్రాటజిస్ట్ ల ప్రభావం పెరిగిపోయింది. వారి మాటకు విలువ ఎక్కువయింది. టిక్కెట్ల దగ్గర నుంచి అన్ని వారు చెప్పినట్లే నడుచుకుంటున్నారు. కానీ వ్యూహకర్తల వల్ల కూడా ఎక్కువ సార్లు గెలిచింది లేదు. మొత్తం మీద ఏపీలో వ్యూహకర్తల కల్చర్ మొదలయిన నాటి నుంచి వారి చేతుల్లోకే పార్టీ అధినేతలు వెళ్లిపోయినట్లే కనిపిస్తుంది.
Next Story