Thu Jan 29 2026 17:33:35 GMT+0000 (Coordinated Universal Time)
బెదిరింపులకు లొంగం.. భయపడేది లేదు
ప్రభుత్వం బెదిరింపులకు భయపడేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు

ప్రభుత్వం బెదిరింపులకు భయపడేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే తమ ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని పీఆర్సీ సాధన సమితి నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్మా వంటి వాటికి కూడా ఉద్యోగులు భయపడబోమని చెప్పారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోగా, తమపై దుష్ప్రచారం చేస్తుందని ఆయన అన్నారు.
తమపై దుష్ప్రచారం....
తాము చర్చలకు రాలేదని అనడం అవాస్తవమని చెప్పారు. మంత్రుల కమిటీతో పీఆర్సీ సాధన సమితి బృందం సమావేశమై చర్చించి వచ్చిందని ఆయన గుర్తు చేశారు. తమ డిమాండ్లపై లిఖితపూర్వకంగా ఇప్పటి వరకూ హామీ ఇవ్వకుండా కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు చెల్లించాలని ఉద్యోగులపై వత్తిడి తేవడమేంటని ఆయన నిలదీశారు. చలో విజయవాడ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్ష లాది మంది ఉద్యోగులు తరలి వస్తారని, అప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంటుందేమో చూడాలని అన్నారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో ఒక అడుగు ముందుకు వేస్తే తాము నాలుగు అడుగులు ముందుకు రావడానికి అభ్యంతరం లేదని ఆయన చెప్పారు.
Next Story

