Mon Mar 16 2026 14:53:08 GMT+0530 (India Standard Time)
Putta Mahesh : నాకు ఏ పాపం తెలియదు.. ఏ తప్పు చేయాలేదు
డ్రగ్స్ ఆరోపణలపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ స్పందన చూసిన వారికి ఎవరికైనా ఇదే అనుమానం కలుగుతుంది

డ్రగ్స్ ఆరోపణలపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ స్పందన చూసిన వారికి ఎవరికైనా ఇదే అనుమానం కలుగుతుంది. తాను అమాయకుడినని, తనకు ఏ రకమైన దురలవాట్లు లేవని చెప్పారు. హైదరాబాద్ మొయినాబాద్ లో జరిగిన జరిగిన డ్రగ్స్ పార్టీలో దొరికిన పుట్టా మహేష్ తన ప్రమేయం ఏమీ లేదని చెప్పుకొచ్చారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ డ్రగ్స్ వార్తలను ఖండించారు.తనకు ఎటువంటి దురలవాట్లు లేవని, ఏ తప్పు చేయలేదని, కేవలం ఒక స్నేహితుడు పిలిస్తే కలవడానికి మాత్రమే మొయినాబాద్ వెళ్ళానని, కలిసి వచ్చే సమయంలో జరిగిన కొన్ని సంఘటనలపై మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయని, వాటిని ఎవ్వరూ నమ్మవద్దని, పోలీసు విచారణకు సహకరిస్తానని, పూర్తి వివరాలతో త్వరలో ప్రజల ముందుకు వస్తానని ఎంపీ తన ప్రకటనలో తెలిపారు. నిజం గెలుస్తుందని కోరారు.
పోలీసులు కేసు నమోదు చేసి...
కానీ పోలీసులు యూరిన్ టెస్ట్ లో పుట్టా మహేష్ కుమార్ కు నెగిటివ్ రిజల్ట్ వచ్చిందని, అయితే యూరిన్ లో నీళ్లు కలపడం వల్లనే అది నెగిటివ్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత జరిపిన రక్తపరీక్షల్లో పాజిటివ్ గా తేలడంతో ఈ కేసులో పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఈ విషయాన్ని ఎస్పీ గిరిధర్ స్పష్టం చేశారు. అయినా సరే పుట్టా మహేష్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని చెబుతున్నారు. అయితే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ పై వచ్చిన ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ఘటనపై ఎంపీ పుట్టా మహేష్ ను వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు సీఎం చంద్రబాబు ఆదేశించారు. డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
షోకాజ్ నోటీసు...
డ్రగ్స్ వాడినట్లు మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి రావడం పార్టీ అధిష్టానం దృష్టికి వచ్చిందని ఈ పరిణామాలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, ఈ వ్యవహారంపై పూర్తి వివరణను తక్షణం అందించాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ అంశంపై సమగ్ర నివేదిక అందించే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కోరింది. వచ్చిన ఆరోపణలపై 48 గంటల్లోపు మీ లిఖితపూర్వక వివరణను పార్టీ రాష్ట్ర అధ్యక్షునికి అందజేయవలసిందిగా కోరామని, గడువులోపు తగిన వివరణ అందించని పక్షంలో పార్టీ నియమావళి ప్రకారం తగిన చర్యలు తీసుకునే పరిస్థితి ఏర్పడవచ్చని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. అయితే పుట్టా మహేష్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, తాను అమాయకుడని చెబుతున్నారు.
Next Story

