Wed Feb 19 2025 20:27:48 GMT+0000 (Coordinated Universal Time)
Nagababu : జగనూ అదే అనుకున్నారు భయ్యా.. చివరకు ఏమయింది సామీ?
జనసేన నేత నాగబాబు చిత్తూరు జిల్లాలో చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ గతంలో ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు

జనసేన నేత నాగబాబు ఇటీవల చిత్తూరు జిల్లాలో చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తూ గతంలో ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా తమదే పదేళ్లు కాదు.. ముప్ఫయి ఏళ్లు పవర్ మనదేనని అనుకుంటారు. అలా అనుకోవడం వారి తప్పు కాదు. ఒక ఎన్నికల్లో గెలుపు చూసి మళ్లీ.. మళ్లీ గెలుపు తమదేనని భ్రమిస్తుంటారు. అది ఏ రాజకీయ పార్టీ నేతలకైనా ఉన్న ఒకే ఒక అవలక్షణం. కానీ ప్రజలు మార్పు కోరుకుంటే ఐదేళ్లు ముగిసిన తర్వాత తిరిగి ఓటమిని మూట కట్టుకోవడం సహజ పరిణామమే. ఎందుకంటే సహజంగా ప్రభుత్వంపై ఉండే వ్యతిరేకతతో పాటు అనేక అంశాలు గెలుపోటములపై ప్రభావం చూపుతాయి. విశ్వాసం ఉండవచ్చు కానీ అతి విశ్వాసం ఏ రాజకీయ పార్టీలో ఉండకూడదు. ప్రజల వద్ద ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి. జాగ్రత్తగా మాట్లాడాలి. వారి మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించాలి.
అలాగే భ్రమించి...
ఏపీ విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో టీడీపీ కూడా అలాగే భ్రమించింది. కానీ ఐదేళ్లు తిరగకముందే పార్టీని 2019 ఎన్నికల్లో ప్రతిపక్షానికి పరిమితం చేశారు. ఇక 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్ కూడా అధికారంతో కొంత విర్రవీగారు. మరో ముప్ఫయి ఏళ్లు తనదేనని అధికారం అని జగన్ కలలు కన్నారు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఏమైంది. బలమైన నేతలు కూడా ఓటమి పాలయ్యారు. సంక్షేమ పథకాలు పనిచేయలేదు. జనం అభివృద్ధివైపు చూశారు. టీడీపీ నుంచి అనేక మంది నేతలు బయటకు వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వన్ సైడ్ విజయం సాధించింది. దీంతో ఇక తమకు తిరుగులేదని ఫ్యాన్ పార్టీ నేతలు విర్రవీగిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు.
2019 ఎన్నికల తర్వాత...
2019 ఎన్నికల తర్వాత జనసేన నుంచి పేరున్న నేతలు పార్టీని వీడి వెళ్లారు. చివరకు పార్టీలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ మాత్రమే మిగులుతారేమోనన్న భయం ఆ పార్టీ క్యాడర్ లో కలిగింది. కానీ అనూహ్యంగా 2014 ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ తో విజయం సాధించింది. ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీకి వచ్చింది. వైసీపీ నుంచి అనేక మంది నేతలు వెళ్లిపోతున్నారు. జగన్ ను కాదని బయటకు వెళ్లి అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఈ పరిస్థితి ఎల్లకాలం ఉంటుందని అనుకోలేమని నాగబాబు తెలుసుకోవాల్సి ఉంటుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. కేవలం మూడు పార్టీలు కలసినంత మాత్రాన గెలుపు గ్యారంటీ అని చెప్పలేం. మరో వైపు ఎవరికీ భయపడమని చెప్పడం పై కూడా నెట్టింట సెటైర్లు వినిపిస్తున్నాయి. వైఎస్ కు భయపడే పెద్దన్నయ్య కాంగ్రెస్ లో ప్రజారాజ్యాన్నివిలీనం చేశారని, జగన్ కు భయపడే తమ్ముడు టీడీపీతో జత కట్టాడని, ఒంటరిగా పోటీ చేసి ధైర్యం నిరూపించుకోవాలని సవాళ్లు విసురుతున్నారు.
కలసి ఉంటారన్న గ్యారంటీ...
ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో అధికారంలో లేరు కాబట్టి క్యాడర్ నుంచి లీడర్ల వరకూ అందరూ అధికారం తమకు వస్తే పదవులు వస్తాయని భ్రమించారు. తమ దశతిరుగుతుందని నమ్మారు. కానీ అందరికీ ఏ పార్టీ అవకాశం ఇవ్వలేదు. దీంతో అసంతృప్తి పెరుగుతుంది. 2024 ఎన్నికల తరహాలో మూడు పార్టీల క్యాడర్ కలసి పనిచేస్తుందన్న గ్యారంటీ లేదు. జగన్ పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చిన సంగతిని ఎవరూ విస్మరించకూడదు. ఒంటరిగా పోటీ చేసి ఆ స్థాయిలో ఓటింగ్ శాతం తెచ్చుకోవడం అంటే ఆషామాషీ కాదు. ఈ విషయం రాజకీయాలు తెలిసిన వారికి ఎవరైనా అర్థమవుతుంది. అందుకని అధికారం ఉంది కదా? అని బీరాలు పోతే చివరకు నష్టం జరిగేది మనకేనని నాగబాబు గుర్తిస్తే మంచిదని సోషల్ మీడియాలో సెటైర్లు వినపడుతున్నాయి. అలాగే ఒక సామాజికవర్గాన్ని ఎవరైనా కించపరిస్తే వారంతా ఏకమవ్వడం గ్యారంటీ అన్న వ్యాఖ్యలు కూడా కనిపిస్తున్నాయి.
Next Story