Fri Dec 26 2025 10:47:17 GMT+0000 (Coordinated Universal Time)
ద్వారంపూడిని ఏమీ చేయలేకపోతున్నారా.. క్యాడర్ లో అసంతృప్తికి కారణమేంటి?
కాకినాడ పట్టణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఈ ప్రభుత్వం చూసీ చూడనట్లు వదిలేసిందని కూటమి పార్టీలకు చెందిన క్యాడర్ అంటోంది

కాకినాడ పట్టణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఈ ప్రభుత్వం చూసీ చూడనట్లు వదిలేసిందని కూటమి పార్టీలకు చెందిన క్యాడర్ అంటోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై సోషల్ మీడియాలో అసంతృప్తి తీవ్రంగా కనపడుతుంది. సోషల్ మీడియాలో కాకినాడ పట్టణ ప్రాంత జనసేన క్యాడర్ మాత్రమే కాదు.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన కూటమి పార్టీ కార్యకర్తలు ఇదే ప్రశ్న వేస్తున్నారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను అనరాని మాటలు అన్నా సహించామని, అయితే ఆయన అక్రమాలపై ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు.
రేషన్ బియ్యం మాఫియా అంటూ...
ఆ మాధ్య కాకినాడ పోర్టు నుంచి అక్రమ రేషన్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేశారన్న ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ ప్రారంభించామని చెప్పారు. అదే సమయంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు సభ్యులు పదవుల్లో ఉండి రేషన్ మాఫియాకు కాకినాడ ప్రాంతంలో తెరలేపారంటూ నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై యాక్షన్ కు ప్రభుత్వం రెడీ అయిందనుకుని భావించామని, కానీ ఇప్పుడు ఆ ఊసే మర్చిపోయి ప్రభుత్వంలో వారు వ్యవహరిస్తుండటాన్ని కూడా కార్యకర్తలు తప్పుపడుతున్నారు. ఇటీవల నారా లోకేశ్ రాజమండ్రి వచ్చినప్పుడు కూడా ఆయన ప్రస్తావన తేకపోవడం పట్ల కూడా పార్టీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
లింకులే కారణమట...
అయితే గత కొన్నాళ్లుగా ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి మౌనంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాలు పంచుకోవడం లేదు. నాడు అధికారంలో ఉండగా జనసేన కార్యకర్తలపై పోలీసులను ప్రయోగించిన విషయాన్ని అధికారంలోకి రాగానే ఎలా మర్చిపోతారంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అయితే రేషన్ మాఫియాకు సంబంధించి సరైన సాక్ష్యాధారాలు లభించకపోవడం వల్లనే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ దానిని క్యాడర్ మాత్రం నమ్మడం లేదు. ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డికి టీడీపీ, జనసేనల్లో నేతలతో సంబంధాలున్నాయని, ఇప్పటికీ ఆయన అదే దందాను వారి సహకారంతో నడుపుతున్నా పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు బయటపెట్టినా చర్యలు తీసుకోకపోవడంపై పార్టీ కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు.
Next Story

