Thu Dec 25 2025 10:41:24 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : అనాధగా మారిన ఆదికేశవులు నాయుడు కుటుంబం
మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబం రాజకీయంగా అనాధగా మారింది

మాజీ ఎంపీ డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబం రాజకీయంగా అనాధగా మారింది. చిత్తూరు మాజీ ఎంపీగా, టీటీడీ ఛైర్మన్ గా ఆదికేశవులు నాయుడు ఒకప్పుడు రాజకీయాలను శాసించారు. కానీ ఆయన మృతి తర్వాత ఆ కుటుంబం రాజకీయంగా ఇబ్బందులు పడుతుంది. ఒక హత్య కేసులో డీకే ఆదికేశవులు నాయుడు కుమార్తె, కుమారుడిని ఇప్పుడు సీబీఐ అరెస్ట్ చేయడం రాజకీయంగా సంచలనంగా మారింది. సీబీఐ అధికారులు డీకే ఆదికేశవులు నాయుడు కుమార్తె కల్పజ, కుమారుడు డీఏ శ్రీనివాస్ లను బెంగళూరులో అరెస్ట్ చేశారు. బెంగళూరులోని వారి నివాసంలో అరెసట్్ చేసిన సీబీఐ అధికారులు తర్వాత వారిని విచారించి జైలుకు తరలించారు.
నేరపూరిత కుట్ర కేసులో...
ఈ ఇద్దరిపై నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, సాక్షాలను చెరిపేయడం వంటి ఆరోపణలను వీరిద్దరూ ఎదుర్కొంటున్నారు. వీరిద్దరితో పాటు కర్ణాటక మానవహక్కుల కమిషన్ డీఎస్పీ మోహన్ కూడా అరెస్టయిన వారిలో ఉండటం విశేషం. 2019 నాటి కేసు వీరి మెడకు చుట్టుకుంది. డీకే ఆదికేశవులు నాయుడు రఘనాధ్ మృతిచెందిన తర్వాత వీరిపై అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఎంట్రీ ఇచ్చింది. రఘునాధ్ ఆదికేశవులు నాయుడు ఆస్తులకు బినామీగా ఉన్నారని భావించి ఆస్తులను తమ పేరిట బదిలీ చేయాలని వీరు వత్తిడి తేవడంతో ఆయన కొన్ని ఆస్తులను బదలాయించారు. మిగిలిన విషయంలో అవి తనవేనని చెప్పినా నమ్మలేదని, ఈ సమయంలోనే రఘునాధ్ అనుమానాస్పద మృతితో బాధితుల ఫిర్యాదు మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగి వీరిని అరెస్ట్ చేసింది.
అనుమానాస్పద మృతితో...
2019లో రఘునాధ్ మృతి చెందగా తర్వాత జరిగిన విచారణలో వీరిద్దరి ప్రమేయం ఉందని భావించి సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తొలుత బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేసినా తమకు సరైన న్యాయం జరగలేదని భావించిన బాధిత కుటుంబం హైకోర్టును, తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా ఆదికేశవులు నాయుడు కుమార్తె కల్పజ జనసేనలో ఉన్నారు. వీరిద్దరూ బెంగళూరులోనే ఉంటూ ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండాలనుకున్నారు. కానీ చివరకు హత్య కేసులో అరెస్ట్ కావడంతో డీకే ఆదికేశవులు నాయుడు కుటుంబం రాజకీయంగా అనాధగా మారిందని అంటున్నారు. మొత్తం మీద డీకే ఆదికేశవులు నాయుడుకు ఉన్న పేరు ప్రతిష్ట మరింత దిగజారిపోయేలా చేశారని అనుచరులు ఆందోళన చెందుతున్నారు.
Next Story

