Fri Dec 05 2025 13:39:07 GMT+0000 (Coordinated Universal Time)
Simhachalam : సింహాచలంలో అపశృతి... గోడకూలి ఎనిమిది మంది మృతి
సింహాచలంలో జరుగుతున్న చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది.ఎనిమిది మంది మరణించారు

సింహాచలంలో జరుగుతున్న చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో అక్కడిక్కడే ఎనిమిది మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అప్పన్నస్వామి నిజరూప దర్శనం చేసుకునేందుకు నేడు లక్షలాది మంది భక్తులు సింహాచలానికి తరలి వచ్చారు. అయితే ఒక్కసారిగా గోడ కూలడంతో ఎనిమిది మంది మరణించారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. సింహాచలంలో కురిసిన భారీ వర్షం కారణంగా ఈ ఘటన జరిగిందని అధికారులు ప్రాధమికంగా గుర్తించారు.
వేకువ జామున...
బుధవారం వేకువ జామున 2.30 గంటల ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో సింహగిరి నుంచి బస్టాండ్ నుంచి పైకి వెళ్లే షాపింగ్ కాంప్లెక్స్ వద్ద సిమెంట్ గోడ కుప్ప కూలింది. ఇక్కడ మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన వారు వెళుతుంటారు. అక్కడ వేసిన టెంట్ భారీ వర్షానికి గోడపైన పడటంతో కూలినట్లు చెబుతున్నారు. ఇటీవల కాలంలోనే ఈ గోడను నిర్మించారని చెబుతున్నారు. అయితే గోడ ఒక్కసారిగా భక్తులపైన పడటంతో వారు నలిగిపోయి మరణించారు. మృతదేహాలను విశాఖపట్నంలోని కేజీహెచ్ కు తరలించారు.
నిజరూప దర్శనంలో...
అక్షర తృతీయ సందర్భంగా సింహాచల వరాహ లక్ష్మీనరసింహస్వామి భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తారు. స్వామివారికి చందనోత్సవం కూడా జరుగుతుంది. గత కొద్ది రోజులుగా ఆలయ అధికారులు ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ముందు నుంచి అధికారులను హెచ్చరిస్తున్నా గోడ విషయాన్ని పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్వామి వారి నిజరూప దర్శనం చేసుకునేందుకు రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు తరలి రావడం భక్తులు క్యూ లైన్ లో వచ్చి దర్శనం చేసుకునేలా వీలు కల్పించారు. ఈ ఘటనతో అక్కడ బీభత్సమైన వాతావరణం ఏర్పడింది. వైదిక కార్యక్రమాల అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు ఆయన కుటుంబ సభ్యులకు నిజరూప దర్శనం కల్పించారు. తర్వాత భక్తులకు స్వామి దర్శనాలు కలిగేలా చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది
Next Story

