Mon Jun 23 2025 03:08:01 GMT+0000 (Coordinated Universal Time)
Pithapuram : వర్మ పిఠాపురంలో పంటికింద రాయిలా మారాడే?
పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి

పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేనల మధ్య విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. అక్కడ టీడీపీ నేతలకు, జనసేన నేతలకు మధ్య పొసగడం లేదు. పవన్ కల్యాణ్ మాజీ ఎమ్మెల్యే వర్మ కు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ అక్కడ ఉన్న జనసేన ఇన్ ఛార్జులతో పాటు కార్యకర్తలు టీడీపీ నేతలు లెక్క చేయడం లేదు. కనీసం ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఆహ్వానాలు ఉండటం లేదు. దీంతో జనసేన నేతల పర్యటనల్లో టీడీపీ నేతలు జై వర్మ.. జై జై టీడీపీ అన్న నినాదాలు పెద్దయెత్తున వినిపిస్తున్నాయి. నాగబాబు పర్యటించినప్పుడు కూడా ఇవే నినాదాలు వినిపించాయి. అయితే జనసేన లోకల్ లీడర్స్ మాత్రం పట్టించుకోవడం లేదు.
రివర్స్ అటాక్ కు...
మరొకవైపు మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఇక లాభం లేదనుకున్నాడో ఏమో రివర్స్ అటాక్ కు రెడీ అయినట్లు కనపడుతుంది. ఇటు కూటమి ధర్మానికి తూట్లు పడకుండానే, జనసేన నేతలను ఇరుకునపడేలా ఆయన చేస్తున్న కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. పిఠాపురం నియోజకవర్గంలో ఇసుక దోపిడీ కొనసాగుతుందని తెలిపారు. ఇసుక మాఫియా పిఠాపురం నియోజకవర్గంలో రాజ్యమేలుతుందని, రాత్రి వేళ రెండు వందల లారీల ఇసుకను తరలిస్తున్నారని కూడా వర్మ వ్యాఖ్యానించడం విశేషం. పోలీసులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని, పోలీసులకు కూడా భారీగానే ముడుపులు ముడుతున్నట్లు అనిపిస్తుందని వర్మ అనడం మరింత ఇబ్బంది పెట్టేలా ఉంది.
మహానాడు తర్వాతే ఈ వ్యాఖ్యలు...
ఉప ముఖ్యమంత్రిగా అందరికీ ఆదర్శంగా ఉందామనుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని మిత్ర పక్షానికి చెందిన నాయకుడు విమర్శలు చేస్తుంటే పవన్ పరువు పోవడమే కాకుండా, పిఠాపురంలో ఏదో జరుగుతుందని అందరకీ అర్థమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన మహానాడు కార్యక్రమంలో కూడా వర్మకు టీడీపీ నాయకత్వం ప్రాధాన్యత ఇవ్వడం కనిపించింది. దీంతో మహానాడు తర్వాత ఈ వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావించకపోయినా, ఆయన ఇమేజ్ ను డ్యామేజీ చేయాలన్న భావన వర్మలో ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
వారికి కౌంటర్ గానేనా?
వర్మ మామూలుగా చేసిన వ్యాఖ్యలుగా దీనిని చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వర్మ సీనియర్ నేత. ఆయన ఏం మాట్లాడితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుస్తుంది. కానీ గతంలో నాగబాబు జనసేన ఆవిర్భావ దినోత్సవంలో చేసిన వ్యాఖ్యలు వర్మను ఇబ్బంది పెట్టేవిగా ఉన్నాయి. అలాగే నాదెండ్ల మనోహర్ కూడా పిఠాపురం పవన్ కల్యాణ్ అడ్డా అని అనడం వర్మ ఇగోను దెబ్బతీసిందంటున్నారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గానే ఇసుక అక్రమ రవాణా పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతుందంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు జనసేనను ఇరకాటంలోకి నెట్టేసి నట్లే కనిపించాయి. ఇసుక అక్రమ రవాణాను అరికట్టలేని తన సొంత నియోజకవర్గంలోనే పట్టు పవన్ కు లేదా? అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
Next Story