Fri Dec 05 2025 16:06:37 GMT+0000 (Coordinated Universal Time)
TDP : పసుపు జెండా కింద పోట్లగిత్తల్లా మారిన టీడీపీ నేతలు..దగ్గుబాటి vs చౌదరి
తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. వీధుల్లోకి ఎక్కి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి వచ్చారు.

తెలుగుదేశం పార్టీ నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. వీధుల్లోకి ఎక్కి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే స్థాయికి వచ్చారు. రెండు గ్రూపులు, మూడు కొట్లాటలుగా మారి అనంతపురం అర్బన్ టీడీపీలో నేతలు డైరెక్ట్ ఫైట్ కు దిగారు. ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గాల మధ్య బాహాబాహీ జరుగుతుంది. గతంలో కొన్ని విషయాల్లో వివాదాలు తలెత్తినా అధినాయకత్వం జోక్యంతో రాజీ కుదిరినట్లే కుదరి మళ్లీ ముదిరింది. ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే వర్గాల మధ్య మాత్రం గ్యాప్ ఇక ఎవరూ పూడ్చలేనంత లోతుకు వెళ్లిపోయిందని స్థానిక టీడీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో అనంతపురం అర్బన్ లో టీడీపీ వివాదానికి ఇప్పట్లో చెక్ పడే అవకాశం కనిపించడం లేదు.
సొంత పార్టీ నేతల నుంచే...
2024 ఎన్నికల్లో తనకు అనంతపురం అర్బన్ సీటు దక్కుతుందని ప్రభాకర్ చౌదరి గట్టిగా భావించారు. పార్టీకి విధేయతగా ఉన్న తనను కాదని మరొకరికి సీటు దక్కే అవకాశం లేదని ఆయన భావించారు. జనసేన నుంచి తనకు థ్రెట్ ఉంటుందని ఆయన అంచనా వేశారు కానీ, సొంత పార్టీ నేతల నుంచే తన సీటు కిందకు నీరు చేరుతుందని ఎన్నికల అభ్యర్థుల ప్రకటన వరకూ ఆయన ఊహించి ఉండకపోవచ్చు. ఊహించని రీతిలో రాప్తాడుకు చెందిన దగ్గుబాటి ప్రసాద్ కు అనంతపురం అర్బన్ టీడీపీ టిక్కెట్ లభించింది. అయితే అధినాయకత్వం ఆదేశం మేరకు లోపల అసంతృప్తి ఉన్నప్పటికీ ప్రభాకర్ చౌదరి ప్రసాద్ గెలుపునకు తన వంతు ప్రయత్నం చేశారు.
దూరంగా పెట్టడంతో...
అయితే ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుబాటి ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే వర్గాన్ని దూరంగా పెట్టడం ప్రారంభించారు. తన వర్గాన్ని ప్రోత్సహిస్తూ అన్ని విషయాల్లో వారికి అండగా ఉంటున్నారు. ఇసుక, మద్యం వంటి కాంట్రాక్టుల్లోనూ ప్రభాకర్ చౌదరి వర్గానికి అన్యాయం జరిగిందని అంటున్నారు. దీంతో రెండు వర్గాలు గత పదమూడు నెలల నుంచి పోరు జరుగుతూనే ఉంది. పోలీసుల వద్దకు కూడా కిడ్నాప్ పంచాయతీ చేరింది. కానీ అధినాయకత్వం జోక్యంతో తాత్కాలికంగా సద్దుమణిగింది. ఇరువురి నేతల మధ్య ఆధిపత్య పోరు అర్బన్ పార్టీ రెండుగా చీలిపోయిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కొట్టుకోవడం ఒక్కటే తప్పించి సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ మూవీపైన...
ఇక ఇటీవల స్థల వివాదంలో కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల వర్గాల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. అయితే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా దీనికి తోడయింది. వార్ 2 సినిమా విడుదలయిన సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ ను దూషిస్తూ టీడీపీ యువత కు చెందిన నేత ధనుంజయ్ నాయుడితో మాట్లాడిన తీరును ప్రభాకర్ చౌదరి వర్గీయులు వైరల్ చేశారు. ఇది ప్రత్యర్థుల పనేనంటూ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చెబుతున్నారు. మరొకవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. మొత్తం మీద తమ్ముళ్ల జోరుతో అనంత పోరు పార్టీకి తలనొప్పిగా మారింది.
Next Story

