Mon Feb 09 2026 18:19:01 GMT+0530 (India Standard Time)
YSRCP : పదవి ఉంటేనే బయటకు వస్తారా... లేకుంటే ఇల్లు వదలరా?
ధర్మాన సోదరులు వైసీపీలో పెద్దగా యాక్టివ్ గా లేరు.

ధర్మాన సోదరులు వైసీపీలో పెద్దగా యాక్టివ్ గా లేరు. జగన్ మంత్రి వర్గంలో ఐదేళ్ల పాటు ఇద్దరు కేబినెట్ లో ఉన్నారు. అయితే ఓటమి తర్వాత మాత్రం పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అయితే తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారని, అప్పుడప్పుడు రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలపై మాత్రం స్పందిస్తూ తాము ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇద్దరు సోదరులు కలుగు లో నుంచి బయటకు వచ్చి పార్టీ కార్యకర్తలకు అందుబాటులోకి వచ్చెదెప్పుడంటూ అనేక ప్రశ్నలు క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి ఓటమి తర్వాత కార్కకర్తల కష్టాలను కూడా వినే ఓపిక వారికి లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నాయకులకు అందుబాటులో లేకుండా...
శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేతలుగా ఉన్న ధర్మాన సోదరులు ఇద్దరూ తమ నియోజకవర్గానికో, హైదరాబాద్ కో పరిమితమయి ఉంటున్నారని, స్థానిక నాయకులకు కూడా అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇద్దరు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం, నర్సీపట్నం నియోజకవర్గంలో జగన్ ఆదేశాలను సయితం అమలు పర్చడం లేదన్నది వాస్తవం. బూత్ లెవెల్ కమిటీలను నియమించమని జగన్ చెప్పినప్పటికీ వారు పెద్దగా పట్టించుకోవడం లేదని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఇలాగయితే నాయకత్వం గ్రామ స్థాయిలో ఎలా బలోపేతం అవుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. గత ఇరవై నెలల నుంచి ఇదే పరిస్థితి నెలకొని ఉందని అంటున్నారు.
స్థానిక సంస్థల సమయం...
స్థానిక సంస్థలు ఎప్పుడైన జరగొచ్చు. ఈ లోపు బూత్ లెవెల్ కమిటీలను నియమించకపోతే గెలుపు ఎలా సాధ్యమవుతుందన్న సందేహాలు వారు వ్యక్తం చేస్తున్నారు. జగన్ కు కూడా పలువురు ద్వితీయ శ్రేణి నేతలు ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో త్వరగా శ్రీకాకుళం జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని, లేకుంటే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతతో ప్రజలు ఉన్నప్పటికీ వారి సస్యలను కూడా పట్టించుకోకకపోవడాన్ని అనేక మంది తప్పు పడుతున్నారు. పదవులుంటే తప్ప వీరు పార్టీ కోసం పనిచేయరా? అన్న భావన అందరిలోనూ కలుగుతుందని అంటున్నారు. మొత్తం మీద సిక్కోలు లో ధర్మాన సోదరుల వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.
Next Story

