Tue Jul 08 2025 16:57:32 GMT+0000 (Coordinated Universal Time)
Devineni Uma : దేవినేని ఆలోచన అదే.. నిజంగా అదే జరిగితే గెలుపు గ్యారంటీ అట
దేవినేని ఉమామహేశ్వరరావు ఆలోచన మారినట్లు కనిపించింది. ఆయన ఇక ఈ టర్మ్ లో ఏ పదవి కోరుకోన్నట్లే కనపడుతుంది

దేవినేని ఉమామహేశ్వరరావు ఆలోచన మారినట్లు కనిపించింది. ఆయన ఇక ఈ టర్మ్ లో ఏ పదవి కోరుకోన్నట్లే కనపడుతుంది. ఏ పదవి తీసుకున్నా తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరమవుతానేమోనన్న భయం పట్టుకుంది. అందుకే దేవినేని ఉమ తన సన్నిహితుల వద్ద చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పుడుతన్నాయి. దేవినేని ఉమ రాజకీయమంతా టీడీపీలోనే కొనసాగింది. అప్పటి నుంచి ఆయన ఓటమి ఎరగని నేతగా ఉన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999 లో ఆయన నందిగామ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2004లోనూ ఆయన నందిగామ నుంచి ఎన్నికయ్యారు. తర్వాత నందిగామ నియోజకవర్గం రిజర్వ్డ్ కావడంతో పార్టీ అధినాయకత్వం సూచన మేరకు మైలవరానికి షిఫ్ట్ అయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో దేవినేని ఉమ మైలవరం నుంచి ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలు కావడంతో దేవినేని రాజకీయం టర్న్ తీసుకుంది.
టిక్కెట్ దక్కకపోయినా...
గత ఎన్నికల్లో టిక్కెట్ దక్కకపోవడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. చంద్రబాబు, లోకేశ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న దేవినేని ఉమకు టిక్కెట్ రాకపోవడంపై పార్టీలో చర్చ జరిగింది. అలాగని దేవినేని ఉమకు వయసు మించి పోలేదు. సీనియర్ నేతల జాబితాలోకి వయసు పరంగా ఇంకా ఆయన పేరు నమోదు కాలేదు. కానీ టిక్కెట్ రాకపోవడానికి వసంత కృష్ణ ప్రసాద్ కారణమని అంటున్నారు. చంద్రబాబు, లోకేశ్ లతో నేరుగా మాట్లాడిన వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి టీడీపీలో చేరిపోయి మైలవరం టిక్కెట్ తెచ్చుకున్నారు. దేవినేని ఉమ కు పార్టీ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ కనుచూపు మేరలో కనిపించడం లేదు.
ఏడాది గడిచిపోయినా...
ఏడాది గడిచిపోయింది. దేవినేని ఉమకు పదవి రాలేదు. అలాగని టీడీపీని వీడే ఉద్దేశ్యం కూడా లేదు. 2029 ఎన్నికల్లో తిరిగి మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో నందిగామ రిజర్వ్ డ్ నుంచి సాధారణ నియోజకవర్గంగా మారుతుందని దేవినేని ఆశలు పెట్టుకున్నారు. అందువల్ల ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కదని భావించిన దేవినేని ఉమ మరో నాలుగేళ్లు ఓపిగ్గా ఎదురు చూడాలని నిర్ణయించారు. అందుకోసమే ఆయన పెద్దగా పదవుల కోసం వెంపర్లాడటం లేదు. నాలుగేళ్లు ఓపిక పడితే నందిగామ ఓపెన్ కేటగిరీలోకి వస్తే ఇక తనకు తిరుగుండదు. అదే మారకపోయినా మైలవం టిక్కెట్ ను ఈసారి అడిగి తెచ్చుకోవచ్చన్నది దేవినేని ఉమ ఆలోచనగా ఉన్నట్లు తెలిసింది. పార్టీ వీడుతున్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెబుతున్నారు.
Next Story