Sat Dec 13 2025 21:44:01 GMT+0000 (Coordinated Universal Time)
TDP : చంద్రబాబు హెచ్చరికలు పనిచేయడం లేదా? మంత్రులకు లెక్కలేనితనం ఎందుకు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ని సార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మంత్రుల్లో మార్పు రావడం లేదు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ని సార్లు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ మంత్రుల్లో మార్పు రావడం లేదు. అందులో తొలిసారి మంత్రులుగా అయిన వారు మరీ పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు. మొదటి సారి ఎమ్మెల్యే టిక్కెట్ దక్కించుకుని లక్కుతో కేబినెట్ లో సామాజికవర్గం కోణంలో చోటు దక్కించుకున్న వారి అనుచరులు రెచ్చిపోతున్నారు. చివరకు చంద్రబాబు 2014 నుంచి 2019 వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వెనకబడిన ప్రాంతమైన రాయలసీమకు తెచ్చిన కియా పరిశ్రమపై కూడా బెదిరింపులకు దిగుతున్నారు. చంద్రబాబుకు ఈ విషయం తెలిస్తే రాజకీయంగా ఇబ్బంది అవుతుందని తెలిసినా లెక్కచేయడం లేదు. కనీసం మంత్రి తన అనుచరులను కూడాకట్టడి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారా? అన్నది ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.
మొదటి సారి గెలిచినా...
పెనుకొండ నియోజకవర్గం నుంచి సవిత మొదటి సారి ఎమ్మెల్యే అయ్యారు. అయిన వెంటనే లక్కు కలసి వచ్చి చంద్రబాబు కేబినెట్ లో మంత్రి అయ్యారు. ఇటీవల మంత్రి సవితకు అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫస్ట్ టైమ్ గా ఎన్నికై అదేదో తమ వల్లనే గెలిచామన్న భావనలో భావనతోనే వీరితో పాటు మంత్రి అనుచరులు కూడా రెచ్చిపోతున్నారని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అనచరులు చంద్రబాబు సర్కార్ కు తలనొప్పులు తెచ్చేలా వ్యవహస్తున్నారు. అణిగి మణిగి ఉండాల్సిన అమాత్యురాలు తన అధికారంతో అధికారుల చేత పనులు చేయించుకోవాల్సిన మంత్రి సవిత దురుసు ప్రవర్తన పార్టీకి ఇబ్బంది కరంగా మారింది. పెనుకొండ తహశీల్దార్ శ్రీధర్ ఇచ్చిన బోకేను మంత్రి సవిత విసిరేసిన వీడియో వైరల్ గా మారింది. గతంలో జరిగిన ఈ ఘటనపై చంద్రబాబు హెచ్చరించినా మార్పు రాలేదు.
కియా అనుబంధ పరిశ్రమలో...
తాజాగా అనంతపురం జిల్లా పెనుకొండ సమీపంలో ఉన్న కియా అనుబంధ పరిశ్రమల దగ్గర మంత్రి సవిత అనుచరుల దౌర్జన్యానికి దిగడం కూడా చర్చనీయాంశమైంది. కియాలో చేపట్టే అన్ని కాంట్రాక్టు పనులు తమకే ఇవ్వాలని మంత్రి సవిత అనుచరులు బెదిరింపులకు దిగడం చర్చనీయాంశంగా మారింది. పెనుకొండ నియోజకవర్గం అమ్మవారిపల్లి దగ్గర ఘటన జరిగింది. కియా అనుబంధ పరిశ్రమల సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి దిగిన మంత్రి సవిత అనుచరులు చివరకు దానిని కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధుల సెల్ ఫోన్లు లాక్కున్నారు. ఈ దృశ్యాలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో టీడీపీ నేతలే పార్టీ కేంద్ర కార్యాలయానికి వీడియోలు పంపినట్లు తెలిసింది. కేబినెట్ లో మార్పులుంటాయని, జాగ్రత్తగా ఉండాలని ఇటీవలమంత్రి వర్గం సమావేశంలో చంద్రబాబు చేసిన హెచ్చరికలు కూడా సీమ తమ్ముళ్లలో పనిచేయడం లేదన్నకామెంట్స్ వినపడుతున్నాయి.
Next Story

