Fri Dec 05 2025 13:17:49 GMT+0000 (Coordinated Universal Time)
Pawan Kalyan : కసితో పనిచేసినా.. కనికరం చూపించరేంటయ్యా?
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదవుల విషయంలో అందరికీ సమాన న్యాయం చేయలేకపోతున్నారంటున్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదవుల విషయంలో అందరికీ సమాన న్యాయం చేయలేకపోతున్నారంటున్నారు. కేవలం కొందరికే పదవులు దక్కడంతో మిగిలిన వారు నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. పార్టీ నాయకత్వంతో టచ్ లో ఉన్నావారితో పాటు ఎంపిక చేసిన కొందరికే నామినేటెడ్ పదవులు లభిస్తున్నాయంటున్నారు. ఇప్పటి వరకూ భర్తీ అయిన పోస్టుల్లో బీసీలకు, శెట్టి బలిజ సామాజికవర్గాలకు దక్కింది తక్కువేనని అంటున్నారు. ఎక్కువగా కాపు సామాజికవర్గానికి చెందిన నేతలకే పదవులు ఇవ్వడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. గత ఎన్నికల్లో అన్ని సామాజికవర్గాలు కలసి పని చేస్తేనే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రయిక్ రేట్ వచ్చిందన్న విషయాన్ని గుర్తుకు తెస్తున్నారు.
కూటమి విజయం కోసం..
గత ఎన్నికల్లో కూటమిగా ఏర్పడినప్పటికీ తమకు టిక్కెట్లు దక్కకపోయినా తాము చెప్పిన వారికి సీట్లు రాకపోయినా పార్టీ కోసం, పవన్ కల్యాణ్ కోసం పనిచేశామని అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పవన్ కల్యాణ్ జనసేన పార్టీ కార్యాలయం చుట్టూ ప్రదిక్షిణలు చేసే వారికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న అసహనం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లాల్లో నామినేటెడ్ పదవుల భర్తీ మిగిలిన సామాజికవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కాపు సామాజివర్గమే గత ఎన్నికల్లో గెలిపించలేదని, కులాలు, మతాలకు అతీతంగా పనిచేయబట్టే అంతటి అద్భుతమైన విజయాన్ని సాధించామని అంటున్నారు. సోషల్ మీడియాలోనూ ఎక్కువగా ఈ ఎంపికపై వ్యతిరేకంగా పోస్టులు కనిపిస్తున్నాయి.
ఆచరణలో మాత్రం...
పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పవన్ కల్యాణ్ మాటలు ఆచరణలో కనిపించడం లేదంటున్నారు. నిజంగా క్షేత్రస్థాయిలో పని చేసిన వారికి పదవులు ఆశించకుండా పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షతోనే కసితో పనిచేశామని చెబుతున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల భర్తీ చూసిన వారికి ఎవరికైనా కాపులకు అధిక ప్రాధాన్యత మిస్తున్నట్లు స్పష్టంగా కనిపించడంతో మిగిలిన సామాజికవర్గాలు కొంత గుర్రుగా ఉన్నాయి. అయితే భర్తీ కావాల్సిన పోస్టులు చాలా ఉన్నాయని, దశలవారీగా అందరికీ అవకాశం కల్పిస్తామని పార్టీ నాయకత్వం చెబుతుంది. మొత్తం మీద పదవుల పంపకం మాత్రం జనసేన పార్టీలో కాక రేపుతుంది. వన్ బై వన్ వరసగా అందరికీ పోస్టులు దక్కుతాయని పవన్ కల్యాణ్ కూడా హామీ ఇస్తున్నారు. అంతవరకూ ఓపిక పట్టాలని కోరుతున్నారు.
Next Story

