Fri Dec 05 2025 09:09:57 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : మాటల్లేవు.. మాట్లాడుకోడాల్లేవ్.. వేటు వేయడమే
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలతో పార్టీ సీనియర్లకు కూడా దడ పుట్టించేలా ఉన్నాయి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలతో పార్టీ సీనియర్లకు కూడా దడ పుట్టించేలా ఉన్నాయి. జగన్ పార్టీకి ఉపయోగపడని నేతలతో పాటు వ్యతిరేకించే నేతలను కూడా వదిలపెట్టబోనని ఇటీవల కాలంలో హెచ్చరికలు జారీ చేస్తుండటంతో పాటు చర్యలు కూడా తీసుకుంటుండటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇంకా నాలుగేళ్లు ఎన్నికలకు సమయం ఉందని భావించిన అనేక మంది నేతలు తమ వ్యాపారాలను చూసుకుంటూ కాలం గడుపుతున్నారు. కార్యకర్తలను పట్టించుకోవడం లేదు. కొందరు నియోజకవర్గాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. వారందరికీ ఇప్పుడు జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో పార్టీ సీనియర్ నేతల్లో కూడా భయం మొదలయింది.
నమ్మకమైన వారిని కూడా...
టెక్కలి ఇన్ ఛార్జి, వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ను పార్టీ నుంచి జగన్ సస్పెండ్ చేశారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ యాక్టివ్ గా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయన వ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయంతో ఆయనను పార్టీ నుంచి పక్కకు తప్పించారు. దువ్వాడ శ్రీనివాస్ జగన్ వీర భక్తుడు. జగన్ అంటే ఒకరకంగా ప్రాణం. అందుకే అధికారంలోకి రాగానే దువ్వాడ శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాకుండా మొన్నటి ఎన్నికల్లో టెక్కలి టిక్కెట్ కూడా ఇచ్చారు. అయితే కూటమి ప్రభంజనంలో ఓటమి పాలయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.
సీనియర్ నేతలను సస్పెండ్ చేసి...
ఇక తాజాగా శ్రీసత్యసాయి జిల్లాలో వైసీపీ నుంచి సీనియర్ నేతలను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం కూడా సంచలనంగా మారింది. హిందూపురం నియోజకవర్గంలో టీడీపీ బలంగా ఉంది. అక్కడ వైసీపీ నేతలు నవీన్ నిశ్చల్ , వేణుగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. హిందూపురం వైసీపీ సీనియర్ నేతలు నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న ఫిర్యాదులపై పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది. సీనియర్ నేతల సస్పెన్షన్ జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఇద్దరినీ పిలిచి జగన్ మాట్లాడవచ్చు. కానీ అలాంటిదేమీ లేకుండానే మాటల్లేవు.. మాట్లాడుకోడాల్లేవ్.. అన్న రీతిలో సస్పెన్షన్ వేటు వేయడం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని వైసీపీలోనూ హాట్ టాపిక్ గా మారింది.
అధికార పార్టీ నేతలతో కలసి...
పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదన్న హెచ్చరికలను జగన్ జారీ చేసినట్లయింది. అనేక జిల్లాల్లో వైసీపీ నేతలు అధికార టీడీపీ, జనసేన నేతల్లో కలసిపోయి తమ వ్యాపారాలను నిర్వహించుకుంటూ పార్టీ కార్యక్రమాలను పక్కన పెడుతున్నారని తెలిసింది. రాయలసీమలోనే కాకుండా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో సయితం వైసీపీ నేతలు అధికార పార్టీ నేతలతో కలసి పోయి పార్టీ పిలుపు నిచ్చిన కార్యక్రమాలను చేయడం లేదన్న నివేదికలు అందుతుండటంతో ఇక స్పేర్ చేస్తే పార్టీకి ఇబ్బంది కలుగుతుందని భావించిన జగన్ యాక్షన్ కు దిగినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఇకపై పార్టీ కోసం పనిచేయని వారిని, పార్టీ లైన్ కు వ్యతిరేకంగా పనిచేసిన వారిని తొలగించాలని జగన్ తీసుకున్న నిర్ణయం సంచలనమే కదా? ఇంకా ఎవరిపై వేటు పడుతుందోనన్న టెన్షన్ వైసీపీ నేతల్లో నెలకొంది.
Next Story

