Fri Dec 05 2025 16:51:20 GMT+0000 (Coordinated Universal Time)
TDP : నాయుడికే ముందు పదవి.. ఆ తర్వాతే లోకేశ్.. చంద్రబాబు స్ట్రాటజీ ఇది
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు పార్టీలోనూ ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు పార్టీలోనూ ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించినట్లు తెలిసింది. నిజానికి మహానాడులో నారా లోకేశ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని అనుకున్నారు. కానీ మహానాడులో అది జరగలేదు. లోకేశ్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలన్న డిమాండ్ చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. సీనియర్ నేతల నుంచి జూనియర్ నేతల వరకూ నారా లోకేశ్ కు కీలకమైన పదవి అప్పగించాలని డిమాండ్ వినిపించినా చంద్రబాబు నాయుడు మాత్రం ఆ ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కన పెట్టారు. అయితే కేవలం మహానాడులో నారా లోకేశ్ ఒక్కరికే పదోన్నతి కల్పిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని భావించి చంద్రబాబు వెనక్కు తగ్గి ఉండవచ్చన్న భావన అందరిలోనూ వ్యక్తమవుతుంది.
పదవి ఇవ్వడంలో...
నారా లోకేశ్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వడం చిటికెలో పని. ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఎందుకంటే ఇప్పటికే నారా లోకేశ్ పార్టీలో కీలక నేతగా ఎస్టాబ్లిష్ అయ్యారు. నారా లోకేశ్ కు పదవి ఇవ్వడంలో ఎలాంటి ఇబ్బందులు లేవు. టీడీపీలో వారసత్వ రాజకీయాలు మాత్రమే కాకుండా యువగళం పాదయాత్రతో పార్టీని మరోసారి అధికారంలోకి తేవడంలోనూ లోకేశ్ పాత్రను కాదనలేం. అయితే ఇదే సమయంలో లోకేశ్ ఒక్కరికే పదోన్నతి కల్పిస్తే బాగుండదని భావించి చంద్రబాబు వెనక్కు తగ్గినట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఈ మేరకు ముందుగా లోకేశ్ టీంను రెడీ చేసి తర్వాత ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుంది.
లోకేశ్ కంటే ముందుగా...
ముఖ్యంగా కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకు ముందుగా పదోన్నతి కల్పించాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది. ఆయనకు పార్టీలో కీలకమైన బాధ్యతలను అప్పగించి తర్వాత లోకేశ్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పొలిటి్ బ్యూరోలో కూడా సమూలమైన మార్పులు చేపట్టడంలో భాగంగా రామ్మోహన్ నాయుడును పొలిట్ బ్యూరోలోకి తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. అందుకే లోకేశ్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చే దాని కంటే ముందు రామ్మోహన్ నాయుడుకు ప్రమోషన్ కల్పించాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలిసింది. పొలిట్ బ్యూరోలోకి తీసుకోవడమే కాకుండా పార్టీలో కూడా కీలకమైన పదవి ఇస్తారంటున్నారు.
మహానాడు ఏర్పాట్లను...
మహానాడు మూడు రోజుల ఏర్పాట్లను కూడా కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు దగ్గరుండి పర్యవేక్షించడం, ఆయనకే ఈ బాధ్యతలను అప్పగించడం, మహానాడు సూపర్ సక్సెస్ కావడంతో ఇక నాయుడుగారి అబ్బాయికి పదోన్నతి గ్యారంటీ అని అంటున్నారు. గత ఎన్నికలకు ముందే రామ్మోహన్ నాయుడును అసెంబ్లీకి పోటీ చేయించాలనుకున్నా, అచ్చెన్నాయుడు రూపంలో కొంత అడ్డంకి ఏర్పడింది. ఈసారి రామ్మోహన్ నాయుడును శాసనసభకు పోటీ చేయించి లోకేశ్ కు చేదోడు వాదోడుగా ఉండేలా చూడాలని కూడా చంద్రబాబు డిసైడ్ అయినట్లు పార్టీలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. అందుకు తగినట్లుగా కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకు చంంద్రబాబు ఇస్తున్న ప్రయారిటీ కూడా అలాగే కనపడుతుంది.
Next Story

