సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో అప్పు వివాదం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఓ అమానుష ఘటన చోటు చేసుకుంది. అప్పు తీర్చలేదన్న కారణంతో ఓ మహిళను అత్యంత దారుణంగా చెట్టుకు కట్టేసి కొట్టిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
కుప్పం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన శిరీష, ఆమె భర్త తిమ్మరాయప్ప మూడేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప అనే వ్యక్తి వద్ద 80 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. వడ్డీ పెరిగి అప్పు భారం ఎక్కువై భర్త తిమ్మరాయప్ప భార్యాబిడ్డలను వదిలి గ్రామం విడిచి వెళ్లిపోయాడు. శిరీష మాత్రం గ్రామంలోనే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. తనకు రావాల్సిన డబ్బుల కోసం శిరీష ఇంటికి మునికన్నప్ప వెళ్లి, గ్రామస్థులందరూ చూస్తుండగానే సమీపంలోని వేప చెట్టుకు తాడుతో కట్టేసి కొట్టాడు.

