Sat Dec 07 2024 18:44:53 GMT+0000 (Coordinated Universal Time)
Rain Alert : తప్పిన తుపాను ముప్పు... తీవ్ర వాయుగుండం రేపు తీరం దాటే అవకాశం
నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతుంది. తుపాను ముప్పు తప్పింది
నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 9 కిమీ వేగంతో తీవ్రవాయుగుండం కదిలింది. నెమ్మదిగా వాయుగుండం కదులుతుండటంతో ఈరోజు కూడా తీవ్ర వాయుగుండంగానే కొనసాగనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ట్రింకోమలీకి 240 కిలోమీటర్లు, నాగపట్నానానికి 330 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 390 కిలోమీటర్లు, చెన్నైకి 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈరోజు కూడా తీవ్ర వాయుగుండంగానే కొనసాగే అవకాశముందని చెబుతున్నారు.
రేపు ఉదయానికి తీరం దాటే అవకాశం...
రేపు ఉదయానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్ మరియు మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో వాయుగుండంగా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే తుపాను ముప్ప తప్పిందని, తీవ్ర వాయుగుండం మాత్రం తీరం దాటే వరకూ అప్రమత్తంగానే ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో ఈరోజు నుంచి రేపటి వరకూ ఆంధ్రప్రదేశ్ లోని దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు ముందుగానే తీసుకోవాలని సూచించారు. నదులు, వాగులు దాటేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
సముద్రం మాత్రం అలజడిగా...
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ కోస్తా, రాయలసీమ కాకుండా మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశంఉందని తెలిపింది. ఈరోజు రేపు తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులు ఈ రెండు రోజుల పాటు చేపలవేటకు వెళ్లవద్దని సూచించారు. సముద్రం అలజడిగా ఉంటుందని తెలిపింది. రైతులు కూడా భారీ వర్షాలకు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, పండించిన ఉత్పత్తులను దాచుకోవడానికి సురక్షితమైన ప్రదేశంలో ఉంచేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పిడుగులు కూడా పడే అవకాశముందని తెలిపింది. అధికారులు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది.
Next Story