Sat Dec 13 2025 22:35:52 GMT+0000 (Coordinated Universal Time)
Cyclone Alert : తుపాను తీరం దాటే సమయంలో ఇలా వ్యవహరించాల్సిందేనట
నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తుపాన్ గా మారనుంది

నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తుపాన్ గా మారనుంది. ఈ తుపాన్ కు 'దిత్వా' గా నామకరణం చేశారు. ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి,ఆనుకుని ఉన్న దక్షిణకోస్తా తీరాల వద్ద తుపాను కదలి శ్రీలంకకు రెండు వందల కిలోమీటర్ల దూరంలోనూ, చెన్నైకి ఆగ్నేయంగా 700 కిలోమీటర్ల దూరంలోనూ, పుదుచ్చేరికి 610 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమయిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం తెల్లవారుజాముకి నైరుతి బంగాళాఖాతం తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు తుపాను చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఈ ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
రేపటి నుంచి వానలు...
ఆంధ్రప్రదేశ్ లో తుపాను ప్రభావంతో శని, ఆదివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రైతులు తమ పంట ఉత్పత్తులను రక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది. ప్రధానంగా వరి వంటి పంటలను కోత కోసి సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవడం మంచిదని సూచించింది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, మిగిలిన చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు పడతాయని పేర్కొంది.
తెలంగాణలోనూ ప్రభావం...
తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా దక్షిణ తెలంగాణలోని జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని చెప్పింది. అయితే ఈరోజు మాత్రం తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం తెలంగాణలో చలితీవ్రత కొంత తగ్గింది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం లేదు. ఏజెన్సీ ఏరియాలో తప్పించి మిగిలిన ప్రాంతాల్లో చలిగాలుల తీవ్రత పెద్దగా లేదు. అయితే రానున్న కాలంలో చలితీవ్రత పెరిగే అవకాశముందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరొకవైపు ఉదయం వేళ పొగమంచు మాత్రం దట్టంగా అలుముకుంటుండటంతో వాహనదారులు, మార్నింగ్ వాకర్స్ ఇబ్బందులు పడుతున్నారు.
Next Story

