Mon Jan 19 2026 17:10:12 GMT+0000 (Coordinated Universal Time)
Cyclone Montha : మొంథా తుపాను ఎఫెక్ట్.. గుంటూరు జిల్లాలో రాకపోకలకు అంతరాయం
మొంథా తుఫాను నేపథ్యంలో గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. రాకపోకలకు పలు చోట్ల అంతరాయం ఏర్పడింది

మొంథా తుఫాను సమయంలోనూ, అనంతర పరిస్థితుల్లోను గుంటూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని జిల్లా కలెక్టర్ తమీన్ అన్సారీయా తెలిపారు. ఫిరంగిపురం మండలం పొనుగుపాడు వద్ద రహదారిపై నీరు ప్రవాహం ఉండటంతో బేతపూడి వాగు వద్ద, చప్టా వద్ద వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. గుంటూరు గ్రామీణ మండలం గోర్లవారిపాలెం వద్ద కొండవీటి వాగు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో అధికారులు తగు చర్యలు తీసుకున్నారు. తాడికొండ మరియు అడ్డా రోడ్ వద్ద కాలువల్లో నీరు రహదారి పైకి రావడంతో అధికారులు ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. పెదనందిపాడు మండలం అభినేని గుంట పాలెం వద్ద వర్షం నీరు రోడ్డుపై ప్రవహించడంతో ప్రమాదాలు జరగకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు.
చెట్లను తొలగించి...
మేడికొండూరు మండలం వై.వి.ఆర్.ఎస్.సి కాలనీ వద్ద చప్ట పై వాగు నీరు ప్రవాహంతో రాకపోకలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. తెనాలి - మంగళగిరి రహదారిలో సోమసుందర పాలెం వద్ద చెట్టు కూలిపోగా తక్షణం తొలగించారు. ఆలూరు వద్ద పడిపోయిన చెట్లను తొలగించారు. దుగ్గిరాల మండలం కరకట్ట - వీరలపాలెం , పెద్ద కిండూరు, పెరుకలపూడి గ్రామాల వద్ద రాత్రి కూలిన చెట్లను తక్షణం తొలగించారు. దొప్పలపూడి వద్ద కూలిన చెట్టును వెంటనే తొలగించారు. విద్యుత్ అంతరాయంతో నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా జనరేటర్లు ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేస్తున్నారు. పలు చోట్ల విద్యుత్ సబ్ స్టేషన్ లకు అంతరాయం కలుగగా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Next Story

