Fri Dec 05 2025 19:33:44 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో మంగళవారం భక్తులు వెయిటింగ్ టైం ఎంతంటే?
తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొంత ఎక్కువగానే ఉంది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ గతం కంటే ఎక్కువగా ఉంది

తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొంత ఎక్కువగానే ఉంది. మంగళవారం కావడంతో భక్తుల రద్దీ గతం కంటే ఎక్కువగా ఉంది. తిరిగి శుక్రవారం మరింత రద్దీ పెరిగే అవకాశముంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ అంతగా లేదు. మొన్నటి వరకూ మహా కుంభమేళా, నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అవుతుండటంతో భక్తులు అతి కొద్ది మంది మాత్రమే వస్తున్నారని టీటీడీ అధికారులు చెబుతున్నారు. తిరిగి మార్చి నెలాఖరు నుంచి రద్దీ పెరిగే అవకాశముంది.
ముందుగా బుక్ చేసుకున్న వారు...
ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకున్న వారు మాత్రమే తిరుమలకు వస్తున్నారు. మరొకవైపు ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. దీంతో తిరుమలకు వచ్చేందుకు భక్తులు జంకుతున్నారు. ఇక ఏప్రిల్, మే నెలలో పరీక్షా ఫలితాలు వస్తాయి కాబట్టి మొక్కులు చెల్లించుకోవడానికి అత్యధిక సంఖ్యలో తిరుమలకు భక్తులు చేరుకుంటారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం లడ్డూ కౌంటర్లు, అన్న ప్రసాదం కేంద్రం వద్ద కూడా భక్తుల రద్దీ స్వల్పంగానే ఉంది.
ఆరు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఆరు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 65,683 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,453 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.74 కోట్ల రూపాయలు వచ్చింది.
Next Story

