Thu Mar 20 2025 01:49:29 GMT+0000 (Coordinated Universal Time)
Tiruamala : తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. స్వామి వారిని దర్శించుకునేందుకు?
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ సహజంగా తక్కువగానే ఉంటుంది.

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ సహజంగా తక్కువగానే ఉంటుంది. దీంతో తిరుమలలోని వీధులన్నీ భక్తులు లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. కంపార్ట్ మెంట్లలో కూడా పెద్దగా భక్తులు లేరు. సెలవులు లేకపోవడం, చలి తీవ్రత పెరగడంతో పాటు నెల చివరి రోజులు కావడంతో ముందుగా బుక్ చేసుకున్న వారు మాత్రమే తిరుమలకు చేరుకుంటున్నారు. పెద్దగా భక్తులు లేకపోవడంతో స్వామి వారిని సులువుగా భక్తులు దర్శించుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఏరోజు కారోజు...
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామికి వారాలు, సీజన్ అంటూ ఏమీ లేకుండా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అయితే అన్ని పరిస్థితులు అనుకూలించాల్సి ఉంటుంది. సెలవు దినాల్లో ఎక్కువ మంది భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నెల 21వ తేదీ వరకూ వైకుంఠ ద్వార దర్శనాలు జరగడంతో భక్తులు లక్షల సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఏరోజు కారోజు ఎస్.టి.డి. టోకెన్లు కూడా విడుదల చేస్తుండటంతో భక్తులు అప్పుడే వచ్చినా తిరుమల దైవదర్శనానికి టోకెన్ పొందే వీలుంది.
హుండీ ఆదాయం...
మరోవైపు నేడు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని రెండు కంపార్ట్ మెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడున్నర గంటల లోపు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 74,742 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో22,422 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.67 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
Next Story