Sat Dec 13 2025 22:30:55 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో మళ్లీ రద్దీ పెరిగింది.. దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. నిన్న మొన్నటి వరకూ మొంథా తుపాను, భారీ వర్షాలు, రైళ్లు, బస్సులు రద్దు కావడంతో తిరుమల ప్రయాణాలను భక్తులు వాయిదా వేసుకున్నారు. గత నాలుగైదు రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగానే ఉంది. కానీ నేడు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో తిరుమల వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. మాడ వీధులన్నీ గోవింద నామస్మరణలతో మారుమోగిపోతున్నాయి. భక్తుల సంఖ్య ఇంక పెరిగే అవకాశముందని భావించి అందుకు తగిన ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్నారు.
వివిధ మార్గాల్లో...
తిరుమలకు వచ్చే భక్తులకు గతంలో మాదిరిగా నేరుగా సర్వదర్శనం క్యూ లైన్ లోకి వెళ్లే అవసరం లేకుండా తిరుపతిలోనే ఎస్.ఎస్.డి. టోకెన్లు జారీ చేస్తున్నారు. ఈ టోకెన్లు తీసుకున్న భక్తులు తక్కువ సమయంలో స్వామి వారిని దర్శించుకునే వీలుంటడటంతో ఎక్కువ మంది భక్తులు ఎస్.ఎస్.డి. టోకెన్ల కోసం తిరుపతి వచ్చి వాటిని తీసుకుని తిరుమలకు చేరుకుంటున్నారు. భక్తులు కాలినడకన వచ్చే వారి సంఖ్య కూడా పెరిగింది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులు కూడా వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
పథ్నాలుగు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పథ్నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు గంటలకు పైగానే సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 63,539 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 23,144 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.76 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

