Sat Nov 08 2025 00:43:10 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన రద్దీ.. రీజన్ ఇదే
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక పౌర్ణమి కావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక పౌర్ణమి కావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. నిన్నమొన్నటి వరకూ భారీ వర్షాలు, తుపానులతో రైళ్లు, బస్సులు రద్దు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగానే ఉంది. అయితే నిన్నటి నుంచి క్రమంగా భక్తుల రద్దీ మళ్లీ పెరుగుతుంది. ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులతో పాటు శుభకార్యాలు, పెళ్లిళ్లు చేసుకున్న వారు స్వామి వారి దర్శనానికి వస్తున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇప్పటి నుంచి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తిరుమలలో కార్తీక శోభ....
కార్తీక మాసం కావడంతో సహజంగానే ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. తిరుమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఆరు నెలల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏడుకొండల వాడి హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. బ్రహ్మోత్సవాల నుంచి భక్తుల రద్దీ మరింత ఎక్కువయింది. అయితే ఎంత మంది వచ్చినా భక్తులు సులువుగా దర్శించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోని పద్దెనిమిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ఉదయం ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 67,091 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో21,111 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.42 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.
Next Story

