Fri Dec 05 2025 19:52:57 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలకు పోటెత్తిన భక్తులు... గరుడ వాహనసేవ కావడంతో క్యూ లైన్ ఎంత పొడగంటే?
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఈరోజు ఆదివారం కావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు తరలి వచ్చారు

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. ఈరోజు ఆదివారం కావడంతో ఎక్కువ మంది భక్తులు తిరుమలకు తరలి వచ్చారు. అందులోనూ గరుడ వాహన సేవ ఉండటంతో లక్షలాది మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. తిరుమలకు గరుడ వాహన సేవరోజు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా తమిళనాడు నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో స్వామి వారి వాహనసేవను తిలకించేందుకు బారులు తీరుతారు. ఈరోజు సర్వదర్శనం టోకెన్లను కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రద్దు చేశారు. క్యూ లైన్ లో వేచి ఉన్న వారు ఇబ్బంది పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అన్న ప్రసాదాలను, మజ్జిగ, పాలు పంపిణీ చేస్తున్నారు.
గరుడ వాహనం సేవ వరకూ...
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఐదో రోజు సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుంచిరాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు గరుడవాహనంలో శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాడ వీధులలో నింపాదిగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్యమంగళ రూప దర్శనమిస్తాడు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడవాహనం ద్వారా స్వామివారు తెలియజేస్తున్నాడు. మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని స్వామివారు భక్తకోటికి తెలియజెప్పుతున్నాడు. భక్తులందరూ ఈ అపూర్వ శ్రీవారి గరుడ వాహన సేవను కనులారా వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. ప్రయివేటు వాహనాలను కూడా కొండపైకి అనుమతించడం లేదు.
గోగర్భం డ్యామ్ వరకూ...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. బయట గోగర్భం డ్యామ్ వరకూ క్యూ లైన్ విస్తరించింది. అంటే రెండు నుంచి మూడు కిలోమీటర్లకు పైగానే క్యూ లైన్ విస్తరించింది. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనం ఇరవై నాలుగు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఇక నిన్న తిరుమల శ్రీవారిని 75,006 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 45,413మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.36 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. మాడవీధుల్లో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు.
Next Story

