Fri Dec 05 2025 19:09:25 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో భక్తుల ఇంతగా పెరగడానికి కారణం ఇదేనా?
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. కంపార్ట్ మెంట్లలో ఎక్కువ సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. గంటల కొద్దీ దర్శనానికి సమయం పడుతుంది. మహా కుంభమేళాకు వెళ్లి వచ్చిన భక్తులు ఏడుకొండలవాడిని దర్శించుకునేందుకు తిరుమలకు క్యూ కట్టినట్లే కనిపిస్తుంది. మరోవైపు ఎండలు ముదిరిపోక ముందే తిరుమలేశుని సందర్శించుకోవాలని ఇతర రాష్ట్రాల నుంచి తీర్థయాత్రల కోసం వస్తున్న భక్తులు కూడా అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు.
ఎండ వేడిమికి...
తిరుమలలో భక్తుల రద్దీ నిన్నటి నుంచి పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కంపార్ట్ మెంట్లలో, క్యూ లైన్ లలో ఏసీ మిషన్లను ఏర్పాటు చేశారు. ఎండతీవ్రత భక్తులకు తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. చల్లటి మజ్జగతో పాటు అన్న ప్రసాదాలను కూడా క్యూ లైన్ లలో భక్తులు శ్రీవారి సేవకుల ద్వారా అందిస్తున్నారు. పాదాలు మండిపోకుండా కార్పెట్లను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. కూల్ పెయింట్ వేయించడంతో కొంత పాదాలు వేడి తగలకుండా భక్తులు దర్శనం ముగించుకుని తిరిగి తమ వసతి గృహాలకు చేరుకుంటున్నారు.
పథ్నాలుగు కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో పథ్నాలుగు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటలకు పైగా సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 68,427 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 21,066 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.81 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.
Next Story

