Fri Dec 05 2025 22:13:15 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : తిరుమలలో భక్తులు రద్దీ అస్సలు లేదుగా...?
తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. బుధవారం కావడంతో భక్తులు అంతగా లేరు.

తిరుమలలో భక్తుల రద్దీ పూర్తిగా తగ్గింది. బుధవారం కావడంతో భక్తులు అంతగా లేరు. సెలవులు అన్నీ పూర్తి కావడంతో భక్తులు కూడా తిరుమలలో పెద్దగా లేకపోవడంతో తిరుమలలోని మాడవీధులన్నీ బోసి పోయి కనిపిస్తున్నాయి. స్వామి వారిని భక్తులు నేరుగా ఎక్కడా ఆగకుండా దర్శనం చేసుకుంటున్నారని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తులు లేకపోవడంతో స్వామి వారి చెంత పెద్దగా సిబ్బంది కూడా భక్తులను ఇబ్బంది పెట్టకుండా కనులారా చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
అన్ని కంపార్ట్ మెంట్లలో...
రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో క్షణం కూడా ఏడుకొండలవాడిని వీక్షించడానికి అవకాశముండదు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది భక్తులను తోసేయడం అందరికీ ఎదురయిన అనుభవాలే. కానీ నేడు మాత్రం ఎక్కువ సేపు స్వామి వారిని వీక్షించేందుకు అవకాశం ఏర్పడింది. పెద్దగా రష్ లేకపోవడంతో కంపార్ట్ మెంట్లన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. అన్నదాన సత్రం, లడ్డూ కౌంటర్ల వద్ద కూడా భక్తుల రద్దీ ఏ మాత్రం లేకపోవడంతో కొన్ని కౌంటర్లను మాత్రమే తెరిచారు. ఇక లడ్డూల తయారీ సంఖ్యను కూడా భక్తుల సంఖ్య తగ్గడంతో కొంత తగ్గించినట్లు తెలిసింది.
హుండీ ఆదాయం మాత్రం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు ఖాళీగానే ఉన్నాయి. కంపార్ట్ మెంట్ లో వేచి ఉండకుండానే నేరుగా స్వామి వారిని దర్శించుకునే వీలుంది. ఈరోజు ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు ఐదు గంటలనుంచి ఏడు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 60,581 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 19,228 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.04 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.
Next Story

