Fri Dec 05 2025 15:40:40 GMT+0000 (Coordinated Universal Time)
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీని కస్టడీలో ఏం అడనున్నారు?
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని న్యాయస్థానం మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది.

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని న్యాయస్థానం మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ విచారణ చేయవచ్చని తెలిపింది. పోలీసులు తమకు వంశీని పది రోజుల పాటు కస్టడీకి కోరినా కేవలం మూడు రోజులు మాత్రమే అనుమతించించింది. మంగళవారం, బుధవారం, గురువారం పోలీసులు గన్నవరం టీడీపీ కార్యాయంపై దాడి కేసులో విచారణ చేయనున్నారు. దీంతో పాటు వంశీని న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని కూడా చెప్పడం కొంత ఊరట నిచ్చే అంశమే. అదే సమయంలో వెన్ను నొప్పి కారణంగా తనకు బెడ్ కేటాయించాలని చేసిన విజ్ఞప్తిపై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది.
మూడు రోజుల విచారణలో...
మూడు రోజుల పాటు విచారణలో వల్లభనేని వంశీని విచారించేందుకు ఇప్పటికే పోలీసులు కొన్ని ప్రశ్నలు సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ప్రధానంగా గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్థన్ ను బెదిరించి, కిడ్నాప్ చేయడమే కాకుండా అతనికి పది లక్షల రూపాయలు ఇచ్చిన విషయంపైనే ప్రధానంగా ప్రశ్నించనుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇచ్చిన ఫిర్యాదును సత్యవర్ధన్ చేత ఎందుకు ఉపసంహరించేందుకు ప్రయత్నించారని కూడా ప్రశ్నించనున్నారు. ఈ పది లక్షలు ఇచ్చి లోబర్చుకోవడానికి ఎవరు మీకు సహకరించారని కూడా మూడు రోజుల కస్టడీలో వల్లభనేని వంశీని ప్రశ్నించే అవకాశాలున్నాయి.
దాడి వెనక?
అదే సమయంలో పట్టాభిపై దాడికి ఉసిగొల్పిన సంఘటనలో మీ ప్రమేయం ఎంత వరకూ ఉంది? ఈరోజు గన్నవరంలో జరిగిన ఘటనల వెనక మీరు మీ అనుచరులకు ఇచ్చిన ఆదేశాలేంటి? వంటి వివరాలను పోలీసులు వల్లభనేని వంశీ నుంచి రాబట్టనున్నారు. వల్లభనేని వంశీ తో పాటు ఇంకెవరైనా ఈ దాడి ఘటనలో ఆదేశాలిచ్చారా? దాడి చేయడానికి గల కారణాలేంటి? ఒక పార్టీ కార్యాలయంపై దాడి చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహించిందెవరు? వంటి ప్రశ్నలతో వల్లభనేనివంశీని ఉక్కిరిబిక్కిరిచేయనున్నారు. ఈరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ విచారించనున్నారు. ఈ మేరకు అధికారులు ప్రశ్నావళిని సిద్ధం చేస్తున్నారు.
Next Story

