Sat Dec 13 2025 22:33:10 GMT+0000 (Coordinated Universal Time)
Jana Sena : నియోజకవర్గాల మార్పిడి ఈసారి తప్పేట్లు లేదుగా?
జనసేనకు చెందిన మంత్రి కందుల దుర్గేష్ ఈసారి నియోజకవర్గాన్ని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి

జనసేనకు చెందిన మంత్రి కందుల దుర్గేష్ ఈసారి నియోజకవర్గాన్ని మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన నిడదవోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ కందుల దుర్గేష్ సొంత ప్రదేశం రాజమండ్రి కావడంతో వచ్చే ఎన్నికల్లో కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారని పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ప్రస్తుతం టీడీపీ నుంచి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. గత ఎన్నికల సమయంలోనే ఇదే తనకు చివరి ఎన్నిక అని కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు.
వచ్చేఎన్నికల నాటికి...
దీంతో వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించి, నిడదవోలు నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కందుల దుర్గేష్ పర్యాటక, సినిమా టోగ్రఫీ మంత్రిగా ఉన్న ప్పటికీ ఆయన ఎక్కువ సమయం రాజమండ్రి లోనే గడుపుతున్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం జనసేన నేతలు, క్యాడర్ తోనూ ఆయన టచ్ లో ఉండటం కూడా ఈ సందేహాలకు మరింత ఊతమిచ్చినట్లు కనిపిస్తుంది. సీనియర్లను క్రమంగా పక్కన పెడుతున్న టీడీపీ అధినాయకత్వం ఈసారి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కూడా టిక్కెట్ ఇవ్వకపోవచ్చు. ఆయన ఇప్పటికే ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయనకు నామినేటెడ్ పదవి ఇచ్చిపెద్దల సభకు పంపుతామని చెప్పి రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారని, అక్కడి నుంచి కందుల దుర్గేష్ పోటీ చేయడం ఖాయమని చెబుతున్నారు.
టీడీపీకి స్ట్రాంగ్ హోల్డ్ గా ఉన్న...
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నిడదవోలు నియోజకవర్గం ఏర్పడింది. 2009, 2014 ఎన్నికల్లో అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థి బూరుగుపల్లి శేషారావు గెలిచారు. అంటే ఇక్కడ టీడీపీ స్ట్రాంగ్ గా ఉంది. నిడదవోలు టీడీపీ క్యాడర్ నుంచి కూడా వత్తిడి తీవ్రంగా వస్తుంది. అందుకే నిడదవోలను వచ్చే ఎన్నికల్లో టీడీపీ తీసుకుని, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మంత్రి గా ఉన్న కందుల దుర్గేష్ ఎక్కువగా ఇక్కడే పర్యటిస్తూ క్యాడర్ కు తాను వచ్చేస్తున్నానంటూ సంకేతాలను ఇస్తున్నారట. మొత్తం మీద ఎక్సేంజ్ మేళాలో రెండు సీట్లను పరస్పరం రెండు పార్టీలు మార్పిడి చేసుకుంటాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.
Next Story

