Mon Jun 23 2025 04:01:20 GMT+0000 (Coordinated Universal Time)
Ap Politics : పక్కా యాపారం గురూ....జనం మూడ్ తెలుసుకోవడం చేతనవుతుందా?
సర్వేలంటూ దూసుకు వస్తున్న సంస్థలు ఫక్తు వ్యాపారంలా మారాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి

సర్వేలంటూ దూసుకు వస్తున్న సంస్థలు ఫక్తు వ్యాపారంలా మారాయన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఏదో ఒకసారి సక్సెస్ అయితే ఇక హండ్రెడ్ పర్సెంట్ తాము జరిపిన సర్వేలకు విశ్వసనీయత ఉంటుందని భావించడమూ భ్రమే అవుతుంది. ఎందుకంటే గతంలోనూ అనేక సర్వే సంస్థలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో అంచనాలు ఫెయిలయి, ఫలితాలు తిరగబడటంతో ఇక మౌనంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. కొత్త కొత్త సంస్థలు రాజకీయ నేతల అవసరాల కోసం పుట్టుకొచ్చి ఆర్థిక వనరులను సమకూర్చుకునేందుకు రాజకీయాన్ని అడ్డాగా మార్చుకంటున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ః
మస్తాన్ సర్వే కూడా...
గతంలో మస్తాన్ కు చెందిన ఆరా సంస్థ సర్వే అంటే దానికి ఒక క్రెడిబులిటీ ఉండేది. గతంలో అనేక సార్లు ఆరా సర్వే చేసిన ఫలితాలు కరెక్టయ్యాయి. ఆయన తీసుకున్న శాంపిల్స్, జనం నాడి సర్వే ఫలితాలకు కూడా దగ్గరగా రావడంతో ఆరా సర్వే పై ఒక క్రెడిబిలిటీ ఏర్పడింది. తెలుగు రాష్ఠ్రాల కోసం ఏర్పడిన సర్వే సంస్థలు అనేకం కొన్ని అంచనాలు నిజం కావడంతో ఇతర రాష్ట్రాల ఎన్నికల సమయంలో కూడా అక్కడకు వెళ్లి సర్వేలు చేయించి తమ ఫలితాలను ప్రజల ముందు ఉంచుతూ వస్తున్నాయి. గత ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆరా సంస్థ సర్వే అట్టర్ ప్లాప్ అయింది. అయితే దీనికి మస్తాన్ ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా ఫలితం లేదు. ఎందుకంటే ఆయన గతంలో ఉన్న ట్రాక్ రికార్డు దెబ్బతినింది. అనేక తప్పిదాలు మస్తాన్ చెబుతున్నప్పటికీ దానికి శాస్ర్రీయత లేకపోవడంతో ఎవరూ నమ్మడం లేదు.
గత ఎన్నికల్లో కేకే సర్వే...
ఇక గత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కేకే సర్వే అనేది ఖచ్చితత్వంతో ముందుగానే ఫలితాలను చెప్పేసింది. కేకే సర్వే చెప్పినట్లుగా ఫలితాలు రావడంతో ఒక్కసారిగా ఈ సర్వే సంస్థ లైమ్ లైట్ లోకి వచ్చింది. తాము సేకరించిన నమూనాలు, తీసుకున్న నియోజకవర్గాలతో పాటు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా సర్వే చేశామని, శాస్త్రీయ పద్ధతుల్లో విశ్లేషణ చేసిన అనంతరం కూటమి ప్రభుత్వం సూపర్ డూపర్ విజయం సాధిస్తుందని చెప్పగలిగామని ఆయన చెప్పారు.తాజాగా ఏడాది పాలన పూర్తయిన తర్వాత కేకే సర్వే లో పందొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు వెనకబడి ఉన్నారని, ముప్ఫయి శాతం ఓట్లు గతంలో కంటే ఈ ఏడాదిలో తగ్గాయని కేకే చెప్పారు. దీంతో పాటు తాము ప్రతి నియోజకవర్గంలో ఒక టీంను ఏర్పాటు చేశామని, పారా వీల్ వెబ్ సైట్ ను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు తమ పనితీరును తెలుసుకోవాలంటే తమ వెబ్ సైట్ ఉపయోగపడుతుందని చెప్పడం విశేషం.
ఓటరు నాడి తెలుస్తుందా?
అంతవరకూ బాగానే ఉంది. అన్ని సార్లూ సర్వే సంస్థల విశ్లేషణలు నిజం కావు. అలాగే జనం కూడా ఇప్పుడు పూర్తిగా బయటపడలేకపోతున్నారు. ఇప్పుడు మైకుల ముందు సోషల్ మీడియాలో మాట్లాడే వారంతా ఎవరి పార్టీల గురించి వారు మద్దతుగా మాట్లాడుతున్నారు. అవతల పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఇవి చూడటానికి, వినడానికి బాగానే ఉంటుంది. కానీ నాలుగేళ్ల ముందే ఓటరు బయటపడతాడా? తాను నాలుగేళ్ల తర్వాత ఓటు ఎవరికి వేయాలో ఇప్పుడే నిర్ణయించకుంటాడా? అదీ కాకుండా ఎమ్మెల్యేల పనితీరు మీద కంటే రాష్ట్ర ప్రభుత్వం పనితీరు మీదనే ఆధారపడి ఎక్కువ శాతం విజయమో, ఓటమో దక్కుతుందని గతంలో అనేక ఫలితాలు తేల్చి చెప్పాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటి నుంచే సర్వేలు మొదలు పెట్టడం యాపారం కాక మరేమిటని సోషల్ మీడియాలో నెటిజనలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
Next Story