Thu Dec 18 2025 10:00:44 GMT+0000 (Coordinated Universal Time)
Alliance Parties : రెండేళ్లలోనే ఇంత ప్రతికూలతా...రానున్న ఎన్నికల్లో శాపంగా మారనుందా?
ప్రభుత్వ అధినేత తీసుకునే నిర్ణయాలు కొంత వరకే పనిచేస్తాయి. కానీ ఎమ్మెల్యేల పనితీరు మాత్రం తీవ్రంగా ప్రభావం చూపుతాయి

ప్రభుత్వ అధినేత తీసుకునే నిర్ణయాలు కొంత వరకే పనిచేస్తాయి. కానీ ఎమ్మెల్యేల పనితీరు మాత్రం తీవ్రంగా ప్రభావం చూపుతాయి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మాత్రమే చూస్తారు. ఇప్పుడు కూటమి పార్టీలకు కూడా ఇదే తలనొప్పిగా మారింది. 164 స్థానాల్లో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు గెలిచాయి. అది మొన్నటి ఎన్నికల్లో వరంగా కనిపించినా రానున్న ఎన్నికల్లో శాపంగా మారనున్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా లోకల్ ఎమ్మెల్యేలపై ప్రతికూలత ఉంటుందన్నది వాస్తవం. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారు అన్ని సమస్యలను పరిష్కరించలేరు. అదేసమయంలో అనేక కొత్త సమస్యలు వచ్చిపడతాయి. వాటిని పరిష్కరించుకోవాలంటే ప్రభుత్వం నుంచి నిధులు అందడం లేదు.
గతానికి భిన్నంగా...
గతంలో సంక్షేమ పథకాలు తక్కువగా.. అభివృద్ధి పనులకు ఎక్కువగా నిధులు వినియోగించేవారు. కానీ 2019 నుంచి ఆ పరిస్థితి మారింది. నాడు జగన్ ప్రభుత్వమైనా, నేడు కూటమి ప్రభుత్వమైనా సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. అభివృద్ధికి అవసరమైన నిధులను కేటాయించలేకపోతుంది. మరొకవైపు కూటమి ప్రభుత్వానికి రాజధాని అమరావతి ప్రధానంగా మారింది. దీంతో నిధులు, తీసుకు వచ్చిన అప్పులు రాజధాని అమరావతిలోనే కుమ్మరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సయితం అమరావతికి తీసుకు వచ్చిన రుణాలను వేరే వాటికి ఉపయోగించలేమని, అలాగే తీసుకున్న అప్పులను కూడా కొన్నింటికే పరిమితం చేస్తామని పదే పదే చెబుతున్నారు.
ఎమ్మెల్యేల అక్రమాలు.. అవినీతి...
మరొకవైపు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పనులు జరగకపోవడంతో పాటు మద్యం, ఇసుక వంటి వాటిల్లో వేలుకాదు.. ఏకంగా చేతులే పెట్టేశారు. అదీ కూటమికి ఇబ్బందికరంగా మారింది. 164 మంది కూటమి ఎమ్మెల్యేల్లో అత్యంత తక్కువగా అంటే దాదాపు నలభై మంది ఎమ్మెల్యేలు మాత్రమే నిధులు ఎలాగోలా తెచ్చుకుని తమ నియోజకవర్గాల్లో సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. మిగిలిన 120కి పైగా స్థానాల్లో ఎమ్మెల్యేలు మంత్రుల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించడం లేదని వాపోతున్నారు. దీంతో ఇటు ఎమ్మెల్యేల అక్రమాలు, అవినీతి మరొకవైపు నియోజకవర్గాల్లో సమస్యలు పేరుకుపోవడం కూటమి పార్టీకి మైనస్ గా మారింది. మరో మూడేళ్లలో వీటి నుంచి బయటపడాలంటే మాత్రం పెద్దయెత్తున కసరత్తు జరగాల్సి ఉంటుంది.
Next Story

