Tue Mar 31 2026 20:16:18 GMT+0530 (India Standard Time)
ఆ యూనియన్లకు జగన్ వార్నింగ్
తాను ప్రజల కష్టాలను పాదయాత్రలో దగ్గర నుంచి చూశానని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేస్తున్నానని జగన్ తెలిపారు.

తాను ప్రజల కష్టాలను పాదయాత్రలో దగ్గర నుంచి చూశానని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేస్తున్నానని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. జగనన్న చేదోడు పథకం కింద 285 కోట్ల రూపాయలను రజకులు, నాయీబ్రాహ్మణులు, టైలర్లకు విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. వీరికి రెండో విడతగా ఈ సాయం అందిస్తున్నామని చెప్పారు. దీని వల్ల 2.85 లక్షల మంది లబ్ది పొందుతారని జగన్ చెప్పారు.
మంచి చేయలన్న తపనతోనే....
బీసీలకు మంచి చేయాలన్న తపనతోనే ఈ పథకాలను అమలు చేస్తున్నానని చెప్పారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా ప్రజలను ఆదుకోవడానికి మాత్రం వెనకాడటం లేదన్నారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి మధ్య తేడా గమనించాలని జగన్ ప్రజలను కోరారు. బీసీలంటే బ్యాక్ బోన్ అని భావించి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. మత్సక్యార భరోసా, నేతన్నల నేస్తం వంటి పథకాలతో బీసీలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఈ ప్రభుత్వం ఆదుకునేందుకు నిత్యం ప్రయత్నిస్తుందని జగన్ చెప్పారు. ఎమ్మెల్సీ, రాజ్యసభ, నామినేటెడ్ పదవుల్లోనూ వారికే ప్రాధాన్యత ఇచ్చామని జగన్ తెలిపారు.
కోవిడ్ సమయంలోనూ...
ఉద్యోగుల సమ్మెలో భాగస్వామ్యులయిన లెఫ్ట్ పార్టీలు కొన్ని యూనియన్లు నిరసనకు దిగుతామంటే బాధ అనిపిస్తుందని చెప్పారు. కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా పిల్లలకు పరీక్షలు పెట్టలేదని, పరీక్షలు సమీపిస్తున్న సమయంలో కొంతమంది ప్రభుత్వంపై రెచ్చగొట్టాలని టీచర్లను రోడ్డెక్కిస్తే పిల్లల చదువులేం కావాలి? అని జగన్ ప్రశ్నించారు. మూడో సంవత్సరం కూడా పిల్లల చదువులు గాలికి వదిలేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఇలా చేయడం ధర్మమేనా అని జగన్ ప్రశ్నించారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించదని చెప్పారు. చంద్రబాబు దత్తపుత్రుడికి ఆందోళనలు కావాలని పరోక్షంగా పవన్ కల్యాణ్ ను జగన్ దెప్పిపొడిచారు.
Next Story

