Fri Dec 05 2025 23:14:46 GMT+0000 (Coordinated Universal Time)
Banakacharla : నేడు ముఖ్యమంత్రుల కీలక భేటీ... కేంద్రం మొగ్గు ఎవరి వైపు?
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో నేడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో నేడు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. కేంద్రం ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నది ఆసక్తి కరంగా మారింది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ వాదనలను కేంద్ర జలశక్తి మంత్రి ఎదుట వినిపించనున్నారు. బనకచర్లకు అనుమతివ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరుతుండగా, ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాదించనున్నారు. గోదావరి జలాల బోర్డు సమావేశంలో వరద నీటి పంపకాన్ని కేటాయించాలని పట్టుబడుతున్నారు.
ఏపీ వాదన ఇలా...
బనకచర్ల ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించలేదని, సీడబ్ల్యూసీ, పర్యావరణ అనుమతులు మాత్రమే తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వాదిస్తుంది. కేవలం సముద్రంలో పోతున్న వృధా జలాలను మాత్రమే వినియోగించుకుంటూ తాము బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి గొంతు ఎండుతున్న రాయలసీమకు తాగునీటితో పాటు సాగునీటిని అందించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని, సీడబ్ల్యూసీ అనుమతి తీసుకుంటామని, వృధాగా సముద్రంలో కలిసే నీటిని పెన్నా నదిలో కలుపుతామని ఆంధ్రప్రదేశ్ చెబుతుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కాళేశ్వరం, దేవాదుల వంటి ప్రాజెక్టులను నిర్మించిన విషయాన్ని ఏపీ ప్రభుత్వం గుర్తు చేస్తుంది.
తెలంగాణ వాదన ఇలా...
మరొకవైపు ఎగువన ఉన్న తమ రాష్ట్రం గోదావరి వరద జలాల నీటిని మళ్లించినందున తెలంగాణ రాష్ట్రానికి నష్టం వాటిల్లుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాదించనున్నారు. ముందు నీటి వాటాలను కేటాయించి, కృష్ణా నదిపై తమ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత మాత్రమే ఏపీకి అనుమతించాలని రేవంత్ రెడ్డి కోరనున్నారు. వృధా జలాల పేరుతో తమకు దక్కాల్సిన నీటి వాటాను తరలించుకుపోతే తెలంగాణ ప్రజలు నష్టపోతారని, అందుకే ఇతర ప్రాజెక్టులపై కూడా చర్చించి బనకచర్లపై తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరనున్నారు. మొత్తం మీద రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలోనే ఉన్నారు. చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ఉండటంతో తనకు అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తుందని నమ్ముతున్నారు. అలాంటి నిర్ణయం తీసుకుంటే తాము అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి కేంద్రాన్ని ఎలా కట్టడి చేయాలో తమకు తెలుసునని తెలంగాణ ముఖ్యమంత్రి అంటున్నారు. మొత్తం మీద ఎవరి వాదన వారిదే. కానీ కేంద్రం మాత్రం ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story

