Tue Mar 31 2026 20:16:29 GMT+0530 (India Standard Time)
మీరు లేకపోతే నేను లేను...ఉద్యోగులతో జగన్
ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగమేనని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

ఉద్యోగులు ప్రభుత్వంలో ఒక భాగమేనని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఈ ప్రభుత్వం అన్ని పథకాలను సక్రమంగా అమలు చేయగలుగుతుంది అంటే అది ఉద్యోగుల సహకారం వల్లనే అని జగన్ అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలు జగన్ ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. సర్దుబాటు నుంచి మినహాయింపుతో 5,000 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని, హెచ్ఆర్ఏ లోకూడా అదనంగా 325 కోట్లు భారం పడుతుందని చెప్పారు.
అదనపు భారం పడుతున్నా....
ఇదే కాకుండా ప్రతి ఏడాది ఎనిమిది వందల కోట్లు, అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వల్ల నాలుగు వందల కోట్లు ఏటా అదనంగా భారం పడుతుందని జగన్ తెలిపారు. అయినా ఉద్యోగులు సంతృప్తిగా ఉండటానికే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ 5,700 కోట్ల భారాన్ని భరించామన్నారు. తాము ఎంత మేర సాయం చేయగలుగుతామో అన్నీ చేశామని చెప్పారు. ఏదైనా సమస్య ఉంటే కమిటీ ఉందని, వారితో ఉద్యోగ సంఘాలు చర్చించవచ్చని చెప్పారు. మంత్రుల కమిటీ కొనసాగుతుందని జగన్ చెప్పారు. ఎవరికీ అన్యాయం చేయాలని ఈ ప్రభుత్వం ఉండదని జగన్ చెప్పారు. 30 వేల మంది టీచర్లకు పదోన్నతి కల్పిస్తున్నట్లు జగన్ తెలిపారు.
భవిష్యత్ లోనూ....
పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచామని చెప్పారు. ఉద్యోగులు లేకపోతే తాను లేనని చెప్పారు. రాజకీయాలను ఇందులోకి లాగవద్దని చెప్పారు. అందరం కలసి కట్టుగా పనిచేసి అభివృద్ధి ఫలాలను అందరికీ అందిద్దామని చెప్పారు. ఎవరూ చేయనిది జగన్ చేశాడు అని అనుకోవాలంటే సీపీఎస్ విధానాన్ని రద్దు చేయడమేనని, దానిపై పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తామని చెప్పారు. అందరినీ భాగస్వామ్యులను చేసి దానిపై అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు. ఇది ఉద్యోగుల ప్రభుత్వమని జగన్ చెప్పారు.
Next Story

