బాబును అసెంబ్లీకి పంపుతారా? ఇంటికి పంపుతారా?
రాష్ట్రంలో భూ వివాదాలు లేకుండా ఉండేందుకు సర్వే చేసి భూ హక్కు పత్రాలను అందచేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.

తనకు తాను పార్టీ పెట్టుకుని ఎవరైనా అధికారంలోకి వస్తే ఎన్టీఆర్, ఎమ్జీఆర్, జగన్ అంటారని, సొంత కూతురును ఇచ్చిన మామ పెట్టిన పార్టీని సొంతం చేసుకుంటే వారిని చంద్రబాబు అంటారని జగన్ అన్నారు. రావణుడిని సమర్థించిన వారిని రాక్షసులంటామని, దుర్యోధనుడిని కొమ్ము కాసిన వారిని దుష్ట చతుష్టయం అని అంటామని, అలాంటిది చంద్రబాబును ఏమనాలని అని జగన్ ప్రశ్నించారు. చంద్రబాబును సమర్థిస్తున్న వారిని ఏమనాలి అని జగన్ ప్రజలను ప్రశ్నించారు. రాక్షస మూకలుగా అనొచ్చని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోయిందన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని అన్నారు.
రిజిస్ట్రేషన్ కూడా గ్రామ సచివాలయంలోనే ఇక జరుగుతాయని జగన్ తెలిపారు. 6,819 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయిందన్నారు. రెండు వేల గ్రామాల్లో సమగ్ర రీ సర్వే పూర్తయిందని జగన్ చెప్పారు. 7,98,298 భూ హక్కు పత్రాలను రైతులకు అందజేస్తామని ఆయన తెలిపారు. చాలా వరకూ లిటిగేషన్లు పరిష్కారమయ్యాయని ఆయన తెలిపారు. తన ఆస్తిని కుటుంబ సభ్యులకు సక్రమంగా అందచేయడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. గత ప్రభుత్వం కిడ్నీ బాధితులను కూడా పట్టించుకోలేదని జగన్ ఆరోపించారు. డయాలసిస్ పేషెంట్లకు పదివేలు ఇస్తున్నామన్నారు. నరసన్నపేట ఆర్ అండ్ బి రోడ్డు విస్తరణ కోసం, మలపం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

