Tue Jun 06 2023 12:49:53 GMT+0000 (Coordinated Universal Time)
పొత్తుల కోసం ఎందుకీ వెంపర్లాట
ప్రభుత్వం మంచి చేయలేదని నమ్మితే వారు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించారు

దుష్టచతుష్టయానికి సవాల్ విసుతున్నానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. ప్రభుత్వం మంచి చేయలేదని నమ్మితే వారు పొత్తుల కోసం ఎందుకు వెంపర్లాడుతున్నారని ప్రశ్నించారు. తిరువూరు నియోజకవర్గంలో జరిగిన జగనన్న విద్యాదీవెన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎందుకు ఈ తోడేళ్లు ఏకమవుతున్నాయని అన్నారు. రాజకీయ విలువలు లేని దుష్టచతుష్టయంతో తాను పోరాడుతున్నానని తెలిపారు. ఎన్నికల బరిలో ఒంటరిగా ఎందుకు పోటీ చేయలేకపోతున్నారని నిలదీశారు. తాను ఎవరి మీద ఆధారపడనని, దేవుడు, ప్రజల మీదనే ఆధారపడతానని తెలిపారు. ఎన్ని కుతంత్రాలు పన్నినా చివరకు మంచే గెలుస్తుందన్నారు. సినిమాలో హీరోయే నచ్చుతాడు కాని, విలన్లు నచ్చడన్నారు.
చదువుకు ప్రాధాన్యత...
విద్యార్థుల జీవన ప్రమాణాలను, ప్రయాణాలను నిర్దేశించేది చదువేనని జగన్ అన్నారు. అందుకే విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. మంచి చదువులతోనే మంచి సమాజం ఏర్పడుతుందని చెప్పారు. చదువులు పేద ప్రజల పిల్లలకు ఆటంకం కాకూడదని అన్నారు. గత ప్రభుత్వం విద్యార్థులకు సక్రమంగా ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని కూడా చేయలేదన్నారు. అందరికీ బకాలు పెట్టి గత ప్రభుత్వం వెళ్లిందన్నారు. ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో సరైన సమయంలో నిధులను విడుదల చేస్తున్నామని జగన్ తెలిపారు. పేదల బతుకులు మార్చాలన్న సంకల్పంతోనే ఈ నిధులను సకాలంలో విడుదల చేస్తున్నామని చెప్పారు.
వచ్చే నెలలో వసతి దీవెన...
చదువులు ఎట్టిపరిస్థితుల్లో ఆగిపోకూడదనే తల్లుల ఖాతాల్లో నగదును జమ చేస్తున్నామన్నారు. 9.65 లక్షల మంది మరి కాసేపట్లో లబ్ది పొందుతున్నారని ఆయన తెలిపారు. పిల్లలు చదువుకు అవసరమైన ఫీజు మాత్రమే కాకుండా వారికి ఉచిత నాణ్యమైన భోజనాన్ని కూడా అందిస్తున్నామని తెలిపారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇరవై వేలు. పాలిటెక్నిక్ చదువుతున్న వారికి పదిహేను వేలు ఇస్తున్నామని తెలిపారు. వసతి దీవెన నిధులను వచ్చే నెల 11న విడుదల చేస్తామని తెలిపారు. పేద పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని చదువుకు అత్యంత ప్రాధాన్యత నిస్తున్నామని తెలిపారు. 13,300 కోట్ల రూపాయలను ఈ ప్రభుత్వం ఈ రెండు పథకాల కింద నాలుగున్నరేళ్లలో ఖర్చు చేశామని ఆయన చెప్పారు
గడప గడపలో సంతోషం...
తనకు రెండేళ్లు సమయమిస్తే గవర్నమెంటు స్కూళ్లును కార్పొరేట్ స్కూళ్లకు మించి డెవలప్ చేస్తామని చెప్పారు. సమాజంలో అణిచివేతకు గురవుతున్న వారి పట్ల స్పందించే హృదయం తనది అని అన్నారు. సామాజిక, మహిళ, రైతులకు న్యాయమని నమ్ముతానని చెప్పారు. గడప గడపలో సంతోషం చూడాలని, ఇంటింటా ఆనందం ఉండాలని తపించే మనసు ఈ ప్రభుత్వానిదని ఆయన అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం అమలు చేయని పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. 45 పరిపాలనను గుండెమీద చేయి వేసుకుని ఆలోచించుకోవాలని జగన్ కోరారు. ఈ నలభై ఐదు నెలలో బటన్ నొక్కి 1.98 లక్షల కోట్ల నిధులను లబ్దిదారులకు అందచేశానని తెలిపారు.
Next Story