Tue Feb 18 2025 09:37:14 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.. చంద్రబాబు వార్నింగ్
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎక్కడా అలసత్వం, అవినీతి, నిర్లక్ష్యం కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎక్కడా అలసత్వం, అవినీతి, నిర్లక్ష్యం కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు సక్రమంగా జరగాలన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేసుకుని పనిచేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల నిర్వహణపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంపై చంద్రబాబు సచివాలయంలో సమీక్ష సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పింఛన్ల పంపిణీ, అన్న క్యాంటీన్, ఎరువులు పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం వంటి అంశాలపై ప్రజల నుంచి ఐవిఆర్ఎస్, క్యూఆర్ కోడ్ స్కానింగ్ తో పాటు పలు మార్గాల్లో నిర్వహించిన సర్వే నివేదికలపై ముఖ్యమంత్రి సమీక్షించారు.
ప్రభుత్వ పథకాలపై...
కొన్ని ప్రభుత్వ పథకాల అమలులో అక్కడక్కడా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఫీడ్ బ్యాక్ పై సమగ్రంగా విచారించి పనితీరు మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఎవరైనా పింఛను ఇంటి వద్ద అందడం లేదని ఫిర్యాదు చేసినా, దీపం పథకంలో ఉచిత గ్యాస్ సిలిండర్ డెలివరీలో సమస్యలు వచ్చినా, అవినీతి ఉందని చెప్పినా, ఆసుపత్రిలో సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసినా వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా కార్యక్రమాలపై ప్రజల స్పందన లో అసంతృప్తి వ్యక్తం చేసిన సదరు లబ్దిదారుల వద్దకు వెళ్లి కారణాలు విశ్లేషించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. పొరపాట్లు జరిగితే సరిదిద్దాలని..అయితే ఉద్యోగుల నిర్లక్ష్యం, అవినీతి ఉంటే మాత్రం సహించవద్దని ముఖ్యమంత్రి తెలిపారు. గ్యాస్ పంపిణీ విషయంలో ఎక్కడైనా అవినీతి జరిగితే...గ్యాస్ ఏజెన్సీలను బాధ్యులను చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
Next Story