Sun Jul 20 2025 06:22:16 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబును తక్కువగా అంచనా వేస్తే ఇక అంతే?
చంద్రబాబు కేవలం రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన విజన్ మాత్రమే కాదు.. వచ్చే ఎన్నికలకు కూడా నాలుగేళ్ల ముందు నుంచే సిద్ధం అవుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన విజన్ మాత్రమే కాదు.. వచ్చే ఎన్నికలకు కూడా నాలుగేళ్ల ముందు నుంచే సిద్ధం అవుతున్నారు. తనకు ప్రత్యర్థి జగన్ అని ఆయనకు తెలుసు. జగన్ బలం, బలగం ఏంటో రెండు ఎన్నికల నుంచి దగ్గర నుంచి చూసిన వ్యక్తి. 2014 నుంచి 2024 వరకూ జగన్ ఓటు బ్యాంకు ఏంటో పక్కా గా తెలిసిన వ్యక్తిగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. జగన్ ఓటు బ్యాంకుకు చీలిక తేవడం ద్వారా వచ్చే ఎన్నికల్లోనూ టీడీపీని విజయ పథాన నడిపేందుకు వ్యూహాలను రచిస్తున్నారు. అందుకే 2014 నాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇప్పుడు కనిపించడం లేదు. అందరికీ అందుబాటులో ఉంటున్నారు.
జనంలోకి నేరుగా...
వైఎస్ జగన్ కు పూర్తి భిన్నంగా ఆయన వ్యవహరిస్తున్నారు. జనంలోకి నేరుగా వెళుతున్నారు. పేదలతో మమేకం అవుతున్నారు. వారి ఇళ్లలోకి వెళ్లి మరీ సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. చంద్రబాబు గతంలో ఎప్పుడూ ఇలా చేయలేదు. తాను ముఖ్యమంత్రిగా, రాష్ట్రానికి ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా మాత్రమే వ్యవహరించే వారు. కానీ 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాత్రం చంద్రబాబు పూర్తిగా మారిపోయారు. ఎంతగా అంటే జిల్లా పర్యటనలకు వెళితే ఖచ్చితంగా సామాన్యులతో కొంత సేపు గడుపుతున్నారు. వారి వెంట నడుస్తున్నారు. కెమెరాల కోసమేనని కొందరు విమర్శలు చేస్తున్నా గతంలో ఇటువంటి చంద్రబాబును రాష్ట్ర ప్రజలు చూడలేదన్నది మాట మాత్రం వాస్తవం.
తక్కువగా అంచనా వేయకుండా...
ఇక జగన్ ను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లోనే నలభై శాతం ఓట్లు వైసీపీకి వచ్చాయి. తాము ముగ్గురం కలసినా అరవై శాతం ఓట్లు వచ్చాయి. అంటే జగన్ ను తక్కువగా అంచనా వేయడానికి వీలులేదు. జగన్ పార్టీని ఒకవైపు బలహీనం చేస్తూనే మరొకవైపు టీడీపీ ని మరింత బలోపేతం చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఏడాది పాలన పూర్తయిన తర్వాత సుపరిపాలన తొలి అడుగు పేరిట జనంలోకి ఎమ్మెల్యేలను పంపడంతో పాటు ఇక తరచూ ఇలాంటి కార్యక్రమాలను రూపొందించి నిరంతరం ఎమ్మెల్యేలను యాక్టివ్ గా ఉంచడం కారణంగా వారితో పాటు పార్టీకి కూడా ఉపయోగకరంగా ఉంటుందని నమ్ముతున్నారు.
క్యాడర్ తో ముఖాముఖి...
ఇక చంద్రబాబు జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ఖచ్చితంగా కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. వారికి ప్రాధాన్యత ఉంటుందని పదే పదే గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు కూడా కార్యకర్తల ఎదుటే వార్నింగ్ లు ఇస్తున్నారు. కార్యకర్తలను విస్మరిస్తే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కూడా ఉండదని హెచ్చరికలు జారీ చేస్తూ క్యాడర్ జారి పోకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. సీనియర్ నేతలను పక్కన పెట్టి యువతకు ప్రాధాన్యమిస్తామని కేవలం మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చూపుతూ యువతను ఆకట్టుకునే ప్రయత్నిస్తున్నారు. పార్టీలో యువనాయకత్వాన్ని మరింతగా ప్రోత్సహించి జోష్ పెంచుతూ ఏడు పదులవయసులోనూ హుషారు రేకెత్తిస్తున్నారు. ఇలా నాలుగు వైపులా చంద్రబాబు వచ్చే ఎన్నికలకు అస్త్రశస్త్రాలను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారు.
Next Story