Fri Dec 05 2025 21:52:57 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఢిల్లీ మీద ఆధారపడి దిగితే నిండా మునిగినట్లేనా?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలు పాతికేళ్లు ముందుంటాయి అంటారు. అందుకే విజన్ ఉన్న లీడర్ అంటారు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలు పాతికేళ్లు ముందుంటాయి అంటారు. అందుకే విజన్ ఉన్న లీడర్ అంటారు. కానీ అమరావతి విషయంలో మాత్రం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదు. ఎందుకంటే రాజధాని నిర్మాణం అనేది ఒక్క ఏడాదిలోనో.. మూడేళ్లలోనో.. పదేళ్లలోనూ జరిగేది కాదు. రాజధాని అభివృద్ధి జరగాలంటే కొన్ని దశాబ్దాలు పడుతుంది. హైదరాబాద్ నగరంలో ఉన్న సైబరాబాద్ నిర్మాణానికి అమరావతి రాజధానికి ముడిపెట్టి చూస్తే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే పెరుగుతున్న జనాభా, అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరంలోనే మరొక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం సులువు. అది కూడా మూడేళ్లలో జరగలేదు. సైబరాబాద్ డెవలెప్ కావడానికి దశాబ్దాల సమయం పట్టిందని ఎవరైనా చెబుతారు. ఇప్పుడు రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు అతి విశ్వాసానికి పోయినట్లు కనిపిస్తుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
ఇప్పుడున్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికే...
ఇప్పటికే ముప్ఫయి వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా ఉచితంగా తీసుకున్నప్పటికీ దానిని అభివృద్ధిచేయడానికి నిధులను సమీకరించడానికి చంద్రబాబు తల ప్రాణం తోకలోకి వచ్చింది. మొదటి ఐదేళ్లలో అది సాధ్యం కాలేదు. రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత అదృష్టం కొద్దీ కేంద్రంలో బీజేపీ టీడీపీపై ఆఆధారపడటంతో అప్పు పుట్టింది. అందుకే కొన్ని భవనాల నిర్మాణానికి అయినా పూనుకున్నారు. దానికి మూడేళ్ల కాలంలో పూర్తి చేయాలని కాలపరిమితినిర్దేశించినప్పటికీ పూర్తయ్యే సమయం ఎవరి చేతుల్లోనూ లేదు. ఇక రెండో దశ భూసమీకరణకు కూడా సిద్ధమయ్యారు. అక్కడే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలన్న బలమైన కోరిక కలిగి మరో ఇరవై వేల ఎకరాల భూమిని సమీకరించాలని నిర్ణయించారు. మంత్రివర్గం రెండోదశ భూ సమీకరణకు అమోదించినా అమలు చేయకపోవడం వెనుక నిధుల సేకరణే ప్రధాన సమస్య అని తెలుస్తుంది.
ఇక రెండో దశకు కావాల్సిన వేల కోట్లు...
రెండోదశలో 20,496 ఎకరాలు సమీకరించేందుకు సిఆర్డీఏ ఆధారిటీ ఆమోదం తెలిపినా సమీకరణ ప్రక్రియ ప్రారంభించలేదు. దీనివెనుక గతంలో ఇచ్చిన భూముల్లో ప్లాట్లే అభివృద్ధి చేయలేదనే అసంతృప్తి ఒకటయితే అదనంగా సమీకరించే భూముల్లో అభివృద్ధి చేసేందుకు నిధులు ఎక్కడ నుండి తీసుకురావాలనేది మరొక ప్రధాన సమస్యగా మారింది. ఇటీవల చంద్రబాబు నాయుడు వద్ద జరిగిన సమావేశంలో ఇదే విషయంపై చర్చ జరిగినట్లు తెలిసింది.సీఆర్డీఏ ఆమోదించిన పనులు పూర్తి చేసేందుకు కనీసం అరవై నాలుగు వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. 42 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. 20,400 కోట్ల విలువైన పనులు అప్పగించారు. ఇందులోనూ ప్రపంచబ్యాంకు నుంచి పదిహేను వేల కోట్లు, హడ్కో జర్మనీ బ్యాంకుల నుండి మరికొంత మొత్తాన్ని రుణంగా తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా తిరిగి చెలించాల్సిన అప్పులే. దీనికి ప్రతి నెలా వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర ఖజానాపై అదనపు భారం అవుతుంది.
మొదటి తారీఖు వచ్చిందంటే అప్పులే...
నెల మొదటితారీఖు వచ్చేసరికి పింఛన్లు, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికే రిజర్వ్ బ్యాంక్ నుంచి అనుమతులు తీసుకుని వివిధ ఆర్థిక సంస్థల ద్వారా నిధులు సేకరించాల్సిన అవసరం ఏర్పడింది. ఏ నెలకు ఆ నెల కష్టంగానే గడుతస్తుంది. మరో ఇరవై వేల ఎకరాలను సేకరించి వాటిని అభివృద్ధి చేయాలంటే మరో నలభై వేల కోట్ల రూపాయలు ఖచ్చితంగా అవసరమవుతుంది.పనులు పూర్తయ్యేనాటికి, రోజులు గడిచే కొద్దీ అంచనా వ్యయం కూడా పెరిగే అవకాశముంది. అందుకే రాజధాని నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారిందనే చెప్పాలి. భూములను సమీకరిస్తే కనీసం మూడేళ్లలోనైనా పనులు ప్రారంభించాల్సి ఉంటుంది. ఇది సాధ్యమయ్యే పనికాదు. కేంద్ర ప్రభుత్వం కూడా అడిగినంత ఇచ్చే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఏపీకి అడిగినంత ఇచ్చే మనసు.. కేంద్రానికి కూడా లేదు. ఢిల్లీ మీద ఆధారపడి దిగితే పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోవడం ఖాయమన్న విశ్లేషణలు వినపడుతున్నాయి. మరి చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది చూడాల్సి ఉంది.
Next Story

