Fri Dec 05 2025 20:49:38 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పనున్న చంద్రబాబు.. సూపర్ సిక్స్ అమలు ఎప్పటి నుంచి అంటే?
ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతి నుంచి అమలు చేయాలని నిర్ణయించారు

ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. సంక్రాంతి నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. ఒక్క తల్లికి వందనం మాత్రం వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానుంది. మిగిలిన ముఖ్యమైన పథకాలన్నీ సంక్రాంతికి ప్రకటించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయన తన మంత్రి వర్గ సహచరులతో చర్చించనున్నారు. ఈ నెల 10వ తేదీన జరిగే మంత్రి వర్గ సమావేశంలో సూపర్ సిక్స్ హామీల అమలు పై మంత్రులతో చర్చించి ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలిసింది. ఎందుకంటే? ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు దాటుతుంది. ఇప్పటి వరకూ పింఛన్లు మినహా ఏ హామీ అమలు పర్చలేకపోయారు.
విపక్సాల విమర్శల నుంచి...
మరోవైపు విపక్షాలు దీనిపై విమర్శలకు దిగుతున్నాయి. ప్రజల్లో కూడా కొంత అసంతృప్తి నెలకొంది. ఆయనకు అందుతున్న ఫీడ్ బ్యాక్ నుంచి వస్తున్న రెస్పాన్స్ కొద్దిగా తేడా కొడుతుండటంతో సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇప్పటికే చంద్రబాబు కలల ప్రాజెక్టులు రెండు కొంత లైన్లో పడుతున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు పదిహేను వేల కోట్ల రూపాయలు మంజూరవుతాయి. ఆ పనులు ప్రారంభం కానున్నాయి. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ క్రమంగా వస్తుంది. దీంతో ఆయన ఇకపై సూపర్ సిక్స్ తో విపక్షాలను కొట్టాలని చూస్తున్నారు.
వరసగా అమలు చేయాలని...
దీపావళికి మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తానని ప్రకటించారు. అది పూర్తయిన వెంటనే నిధులను సమీకరించుకుని మిగిలిన హామీలను కూడా అమలు పర్చేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం సంక్రాంతి నుంచి ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెలకు మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల భారం అవుతున్నప్పటికీ ఈలోపు రాష్ట్ర ప్రభుత్వ ఖజనా కొంత బలపడుతుందన్న ఆశాభావంతో ఉన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు సంక్రాంతి నాటికి సూపర్ సిక్స్ లో మహిళలకు ఇచ్చిన కొన్ని కీలకమైన హామీలను నెరవేర్చడానికి సిద్ధమవుతున్నారు. ఢిల్లీ నుంచి రాగానే ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన అనంతరం ఈ నెల 10వ తేదీన వీటిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Next Story

