Fri Feb 06 2026 00:10:30 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : జనాభా పెరిగితే ఎవరికి లాభం బాసూ.. ఇక్కడా రాజకీయాలేనా?
ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ప్రతి బహిరంగ సభలో జనాభా పెంచాలని ప్రోత్సహిస్తున్నారు. పదే పదే ప్రకటనలు చేస్తున్నారు

ఇటీవల దక్షిణ భారత దేశంలో జనాభా తగ్గుతుందన్న వార్తలు పదే పదే వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ప్రతి బహిరంగ సభలో జనాభా పెంచాలని ప్రోత్సహిస్తున్నారు. పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ఒకప్పుడు అధిక జనాభా అనర్థాలకు కారణమన్న పాలకులు నేడు అధిక జనాభా లాభదాయకమని ప్రచారం చేస్తుండటం విచిత్రంగానే అనిపిస్తుంది. అయితే ఒక రకంగా చంద్రబాబు చెబుతున్న దానిలో నిజం లేకపోలేదు. ఎందుకంటే జనాభా సంఖ్య తక్కువగా ఉంటే ఉత్పాదక శక్తి రాను రాను తగ్గిపోతుంది. రాష్ట్రంలో వృద్ధుల సంఖ్య పెరిగిపోయి యువత సంఖ్య తగ్గుతుంది. దీనివల్ల రాష్ట్ర ఆదాయానికి పెద్ద సంఖ్యలో గండి పడుతుంది.
ఉత్పాదకరంగంపై...
వృద్ధులకు ప్రభుత్వం వివిధ రూపాల్లో అందించనున్న ప్రయోజనాలు పెరిగే కొద్దీ రాష్ట్ర ఖజానాపై భారం పడుతుంది. దీంతో పాటు ఉత్పాదక రంగం కూడా కుంటుపడిపోతుంది. నిపుణుల కొరత ఏర్పడుతుంది. యువత సంఖ్య తగ్గడం వల్ల రాష్ట్ర ఆదాయంతో పాటు జీడీపీ కూడా పడిపోతుంది. అదే సమయంలో పరిశ్రమలకు కావాల్సిన కార్మికుల కొరత కూడా ఏర్పడి ఉత్పత్తి తగ్గిపోతే దాని ప్రభావం అనేక రూపాల్లో ప్రభుత్వంపై పడనుంది. అందుకే చంద్రబాబు నాయుడు పదే పదే జనాభా పెరగాలంటూ జనాలకు హితబోధ చేస్తున్నారు. అంతేకాదు గతంలో చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అనే నినాదాన్నినేడు తుడిపేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద కుటుంబమే అన్ని సమస్యలకు పరిష్కారం అన్న నినాదాలను అందుకోవాల్సి వచ్చింది.
గతకొన్నిదశాబ్దాల నుంచి...
గతంలో ప్రభుత్వ ప్రచారం వల్ల కానీ, పెరిగిపోయిన ఖర్చుల వల్ల కానీ జనాభా సంఖ్య గణనీయంగా తగ్గింది. ఎక్కువ మంది ఒకరు లేదా ఇద్దరు పిల్లలతో ముగించేశారు. ఇది గత కొన్నేళ్లుగా అంటే 1990 నాటి నుంచి ప్రారంభం కావడంతో నేటికి జనాభా సంఖ్య తగ్గుదలకు కారణమయింది. ఈ కారణంతో కేంద్ర ప్రభుత్వం వచ్చే నిధుల విషయంలోనూ కొంత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికగా నిధుల కేటాయింపు జరగనుండటంతో పాటు మరో కీలకమైన రాజకీయ అంశం కూడా ఇందులో చోటు చేసుకుంది. జనాభా సంఖ్య ఆధారంగానే నియోజకవర్గాల సంఖ్య కూడా పెరగడమో, తగ్గడమో జరుగుతుంది. ఈ నేపథ్యంలో దక్షిణాదిన లోక్ సభ స్థానాలను గణనీయంగా తగ్గనున్నాయి.
నిధులు, పథకాలు...
ఇప్పటికే కేంద్రంలో ఉత్తర భారత దేశానికి చెందిన వారు రాజ్యమేలుతున్నారు. పాలకులు తమ ప్రాంతంవైపు ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. పరిశ్రమల స్థాపన దగ్గర నుంచి నిధుల కేటాయింపు వరకూ జనాభా సంఖ్యను ప్రాతిపదికగా తీసుకున్నారు. నీటి వనరుల కేటాయింపు కూడా జనాభా ప్రాతిపదికనే జరుగుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు సయితం దీనిపైనే ఆధారపడి రాష్ట్రాలకు దక్కనున్నాయి. ఇప్పటికే దక్షిణ భారతదేశంలోని అనేకరాష్ట్రాల్లో జనాభా సంఖ్య తగ్గుదల స్పష్టంగా కనిపిస్తుంది. ఇది రాజకీయంగా పార్టీలకు కొంత నష్టమే. అదే సమయంలో ప్రజలకు కూడా దీర్ఘకాలంలో నష్టం వాటిల్లే అవకాశాలున్నాయి. అయితే తమ కుటుంబాలను పోషించుకునే శక్తిని గుర్తించి మాత్రమే ఎవరైనా జనాభా సంఖ్య గురించి ఆలోచిస్తారు కానీ, రాష్ట్ర, రాజకీయ ప్రయోజనాలు జనాలకు అనవసరం అన్న ప్రశ్నకు కూడా నేతల వద్ద సమాధానం లేదనే చెప్పాలి. మొత్తం మీద తాజాగా పెద్దకుటుంబం - చింతలేనికుటుంబం అనే నినాదం త్వరలో తెలుగు రాష్ట్రాల్లో ఊపందుకోనుంది.
Next Story

