Tue Feb 10 2026 18:20:19 GMT+0530 (India Standard Time)
TDP : మాగుంటను ముఖ్యమంత్రి చంద్రబాబు మందలించారా?
టీడీపీకి చెందిన ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై సోషల్ మీడియాలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతోం

టీడీపీకి చెందిన ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై సోషల్ మీడియాలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతోంది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీలో చేరనున్నారన్న ప్రచారం ఊపందుకుంది. వైఎస్ జగన్ సోదరుడు సునీల్ రెడ్డి కుమారుడి వేడుకలో చెన్నైలో జగన్ ను కలవడమే ఈ ప్రచారానికి ఊతమిచ్చినట్లయింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి జగన్ తో షేక్ హ్యాండ్ ఇవ్వడంతో పాటు ఆయనతో చనువుగా మాట్లాడటాన్ని టీడీపీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. ఇది పార్టీ క్యాడర్ లో తప్పుడు సంకేతాలు వెళతాయని చెబున్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇలా చేయడం వల్ల పార్టీ కార్యకర్తల్లో నేతలందరూ ఒక్కటేనన్న భావన ఎక్కువవుతుందన్న వాదన నెట్టింట తెలుగు తమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు. లోకేశ్ సయితం మాగుంట తీరుపై ఆగ్రహం చెందుతున్నారంటున్నారు.
కలిసిన తీరుపైనే...
మాగుంట శ్రీనివాసులు రెడ్డి జగన్ ను మామూలుగా కలిసి వెళితే ఒకే.. కానీ ఆప్యాయంగా ఆయన పలకరించిన తీరు ఇక్కడ తేడా కొడుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. లాంగ్వేజీ, బాడీ లాంగ్వేజీ డిఫరెంట్ గా ఉన్నాయంటున్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి తరచూ పార్టీలు మారుతుండటం ఇందుకు కారణం. రాష్ట్రం విడిపోక ముందు కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా పనిచేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి తర్వాత టీడీపీలో చేరి ఒంగోలు పార్లమెంటు స్థానినికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో టీడీపీ ఎమ్మెల్సీ అయ్యారు. 2019 ఎన్నికల నాటికి వైసీపీలో చేరి తిరిగి ఒంగోలు ఎంపీ అయ్యారు. మళ్లీ 2024కు ముందు టీడీపీలో చేరి ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు.
పోటీ చేయబోనని...
జనం నాడిని బట్టి ఆయన ప్రయాణం సాగుతుందని, అందుకే మాగుంట శ్రీనివాసులు రెడ్డి జగన్ తో కలవడాన్ని తప్పుపట్టాల్సి వస్తుందని టీడీపీ నేతలు సయితం అంటున్నారు. కానీ పారిశ్రామికవేత్త కావడంతో పాటు గతంలో ఆ పార్టీ తరుపున ఎంపీగా ఎన్నిక కావడం వల్లనే కేవలం పలకరింపుతోనే సరిపెట్టారని మాగుంట అనుచరులు చెబుతున్నారు. మరొకవైపు మాగుంట శ్రీనివాసులు రెడ్డి తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ఇప్పటికే ప్రకటించారు. తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తారని ప్రకటించారు. కేవలం కాకతాళయంగానే కలసిన ఘటనగానే చూడాలని అంటున్నారు. తెలుగు తమ్ముళ్లు మాత్రం పార్టీ నాయకత్వం మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు మాగుంటతో ఇలాంటివి తప్పుడు సంకేతాలు వెళతాయని చెప్పినట్లు తెలిసింది.
Next Story

