Sat Dec 13 2025 19:30:26 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు అసలు వ్యూహం అదేనా? దీంతో జగన్ ఆటకట్టినట్లేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో మాదిరి ఈసారి పోలవరం జపం పెద్దగా చేయడం లేదు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో మాదిరి ఈసారి పోలవరం జపం పెద్దగా చేయడం లేదు. 2027 నాటికి పూర్తి చేస్తామని అప్పుడప్పుడు చెబుతున్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం .. పోలవరం నినాదంతో ముందు కెళ్లారు. అయితే ఈసారి ఆయన అమరావతి నినాదాన్ని తలకెత్తుకున్నారు. చంద్రబాబు ఇప్పుడు అమరావతి విషయంలో పెట్టిన శ్రద్ధ మిగిలిన విషయాల్లో పెట్టడం లేదన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు తన కలల రాజధాని అమరావతిని ఎలాగైనా ఒక దశకు ఈసారి తీసుకు రావాలని తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. మూడేళ్లలో పూర్తి చేయాలని భావించినా అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండేళ్ల కాలం కావస్తుంది.
మూడేళ్లలో పనులు పూర్తికి...
2028 నాటికి మూడేళ్ల కాలం పూర్తవుతుంది. అందుకే త్వరగా పనులకు టెండర్లు పిలవడంతో పాటు వాటి పనులను సత్వరమే పూర్తి చేయాలని ఎప్పటికప్పడు మంత్రి నారాయణతో పాటు సీఆర్డీఏ అధికారులను హెచ్చరిస్తున్నారు. అనుకున్న సమయానికి ఇప్పుడు చేపట్టిన పనులు పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఎన్నికలకు వెళ్లాలన్నది చంద్రబాబు ఆలోచన. అప్పుడే కూటమి ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుందని చంద్రబాబు గట్టిగా విశ్వసిస్తున్నారు. అయితే వాతావరణం కూడా ఈ పనుల నిర్వహణకు సహకరించాల్సి ఉంటుంది. మూడేళ్లలో ఎనిమిది నెలలు వానలతో సరిపోతాయి. ఇక మిగిలేది 28 నెలలు మాత్రమే మిగిలి ఉంటాయి. అందుకే శీతాకాలం, వేసవి కాలంలో పనులు వేగంగా జరగాలని చంద్రబాబు పదే పదే అధికారులను ఆదేశిస్తున్నారు.
సంక్షేమ పథకాలను గ్రౌండ్ చేసి...
మరొకవైపు సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు అవసరమైన నిధుల సమీకరణ విషయంలో ఆయన తలమునలవుతున్నారు. ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన వాటిని అమలు చేశామన్న భావనలో ఉన్నారు. మిగిలిన వాటిని కూడా వచ్చే ఏడాదికి పూర్తి చేసి పూర్తిగా చేశామని ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటున్నారు. దీని వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి పార్టీలకు రాజకీయంగా ప్రయోజనం ఉంటుందన్న అంచనాలో ఉన్నారు. అందుకే మిగిలిపోయిన హామీలను వెంటవెంటనే పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లు తెలిసింది.
జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసి...
దీంతో పాటు జోనల్ వ్యవస్థ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. విశాఖ, అమరావతి, రాయలసీమ జోన్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విశాఖ రీజియన్లో 9 జిల్లాలు, అమరావతిలో 8 జిల్లాలు, రాయలసీమ జోన్లో 9 జిల్లాలు ఉండనున్నాయి. మూడు ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నీతి ఆయోగ్, సింగపూర్ సంస్థల ఆధ్వర్యంలో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సీఎం చంద్రబాబు సారథ్యంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాటయింది. ఒక్కో జోన్కు సీఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించారు. విశాఖ జోన్కు సీఈవోగా యువరాజ్. అమరావతి జోన్కు సీఈవోగా మీనా, రాయలసీమకు సీఈవోగా కృష్ణబాబు నియామకం చేశారు. నేడు, రేపట్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఇలా అన్ని అస్త్రాలతో చంద్రబాబు వచ్చే ఎన్నికలకు నాటికి సిద్ధమవుతున్నట్లే కనిపిస్తుంది.
Next Story

