Wed Feb 25 2026 14:57:32 GMT+0530 (India Standard Time)
Chandrababu : చంద్రబాబు సమీక్షలు అంతవరకేనా? గ్రౌండ్ లెవెల్ లో వేరేలా ఉందా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు నెలలకు ఒకసారి జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ జరుపుతారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు నెలలకు ఒకసారి జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ జరుపుతారు. నిత్యం ఏదో ఒక శాఖపై సమీక్ష నిర్వహిస్తుంటారు. చంద్రబాబు నిరంతరం ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న తపనతోనే అధికారులతో నిత్యం టచ్ లో ఉండి వారికి దిశా నిర్దేశం చేస్తుంటారు. అయితే చంద్రబాబు ఎన్ని సమీక్షలు చేసినా, ఎన్ని సార్లు కలెక్టర్లు, ఎస్పీలు కాన్ఫరెన్స్ పెట్టినా సంఘటనలు మాత్రం వరసగా జరుగుతూనే ఉన్నాయి. పాలు కల్తీతో రాజమహేంద్ర వరంలో నలుగురు మరణించడం విషాదం. అలాగే శ్రీకాకుళం జిల్లాలో డయేరియా ప్రబలి అస్వస్థతకు గురి కావడం, వరసగా బాలికలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతుండటం వల్ల ప్రయోజనం ఏంటన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.
జిల్లాల్లో మాత్రం...
సమీక్షలపై చంద్రబాబు నాయుడు శ్రద్ధ పెడుతున్నారు కానీ మంత్రుల మాటకు పెద్దగా విలువ లేకపోవడంతో వారు జిల్లాల్లో పర్యటించినా పెద్దగా అధికారులు కేర్ చేయడం లేదన్న విమర్శలున్నాయి. ముఖ్యమంత్రికి నేరుగా అన్ని విషయాలు తెలిసే అవకాశం ఉండదు. ఆయన కళ్లు, చెవులుగా రకరకాల వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి కాబట్టి వారు ఇచ్చిన సమాచారాన్ని మాత్రమే ఆయన పరిగణనలోకి తీసుకుంటారు. ఇక ఇంటెలిజెన్స్ వ్యవస్థలు, నిఘా వర్గాలు ఇచ్చే సమాచారంపై అధికారంలో ఉన్న వారు ఆధారపడుతూ ఉంటారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వ అధికారుల పనితీరును అంచనా వేసి వారిని గాడిన పెట్టేవారు లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.
వరస ఘటనలతో...
వరస సంఘటనలు కూటమి ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారాయి. కలెక్టర్లు, ఎస్సీలు కూడా మంత్రులు, ఎమ్మెల్యేల ఒత్తిడికి లొంగి చూసీ చూడనట్లు వ్యవహరించడం వల్లనే కల్తీ రాయుళ్లతో పాటు హింసాత్మక ఘటనలు కూడా ఎక్కువయ్యాయనే వారు లేకపోలేదు. కేవలం చంద్రబాబు నాయుడు సమీక్షలతోనే అధికారుల్లో చలనం రాదు. అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే మిగిలిన వారంతా తమ విధులను సక్రమంగా నిర్వహిస్తారు. అంతే తప్ప కలెక్టర్ల కాన్ఫరెన్స్ లు, సమీక్షలు సమస్యలను రాకుండా ఆపలేవన్నది వాస్తవం. ప్రభుత్వ వ్యవస్థలో ప్రజాప్రతినిధుల జోక్యం ఉన్నంత కాలం ఇలాంటి ఘటనలకు ఫుల్ స్టాప్ పడదన్నది వాస్తవం. ఇప్పుడైనా ఘటన జరిగిన వెంటనే అధికారులను బాధ్యులను చేస్తే కొంత ఫలితాలు ఉంటాయన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతుంది.
Next Story

