Tue Jul 08 2025 18:06:11 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబు ఎమ్మెల్యేలను కట్టిపడేశారా? నెల రోజులు నో రిలాక్స్
చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు నిద్ర లేకుండా చేస్తున్నారు.కార్యక్రమాలతో నియోజకవర్గానికి ఫిక్స్ చేస్తన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను నిద్రపోరు.. ఇంకొకరిని నిద్రపోనివ్వరు అని అంటారు. గతంలోనూ అధికారులను ఆయన నిద్రపోనివ్వకుండా పనిచేయించేవారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఫీడ్ బ్యాక్ లోనూ, వివిధ సర్వేల్లోనూ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో పాటు చాలా మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు దూరంగా ప్రజా పనులు చేయకుండా సొంత పనుల్లో నిమగ్నమవ్వడంతో వారిని కట్టిపడేసే కార్యక్రమాన్ని తీసుకు వచ్చారు. అదే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం. నిన్నటి నుంచి ప్రారంభమయిన ఈ కార్యక్రమంలో కొందరు మినహా అందరు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఇంటింటికి తిరుగుతూ...
ఇంటింటికి తిరుగుతూ ఏడాది కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే కార్యక్రమాలను తీసుకు వెళుతున్నారు. పింఛను నాలుగు వేల రూపాయలు ప్రతి నెల ఒకటో తేదీన అందించడంతో పాటుగా దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, మెగా డీఎస్సీ కింద పదహారు వేల పోస్టులను భర్తీ చేయడం, తల్లికి వందనం అమలు చేయడంతో పాటు త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించనున్నట్లు జనాల్లోకి తీసుకెళ్లాలని ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో దిశానిర్దేశం చేశారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను కూడా వివరిస్తున్నారు.
గ్యాప్ లేకుండా...
ఇక నెల రోజుల పాటు నియోజకవర్గాన్ని వదిలి వెళ్లకుండా చంద్రబాబు ఎమ్మెల్యేలను ఫిక్స్ చేసేశారు. తాము గెలిచిన ఏడాది లోనే తమకు ఓటేసిన ప్రజల వద్దకు వెళ్లి వారికి కనిపించి సమస్యలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. అంతేకాకుండా ఎమ్మెల్యేల వెంట కార్యకర్తలు కూడా వెళ్లాల్సి ఉండటంతో వారిని కూడా కలుపుకుని వెళితే చాలా చోట్ల ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు మధ్య గ్యాప్ తొలిగిపోతుందని కూడా చంద్రబాబు ఆలోచన. దీంతో పాటు ప్రజలు ఏమనుకుంటున్నారో తమకు ఫీడ్ బ్యాక్ అందుతుందని, ప్రజలు ప్రధానంగా కోరుకునే వాటిపై తర్వాత ఫోకస్ పెట్టడానికి ఎమ్మెల్యేల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునేందుకు కూడా చంద్రబాబు ఆలోచిస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు ఎమ్మెల్యేలను నియోజకవర్గానికే ఫిక్స్ చేసినట్లు కనపడుతుంది. నెల రోజులు మాత్రం నో రిలాక్స్.
Next Story