Fri Dec 05 2025 12:48:17 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : చంద్రబాబు మరో సూపర్ ఐడియా.. వారి కోసం ప్రత్యేక పథకం
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని త్వరలో అమలు చేయనుంది.
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని త్వరలో అమలు చేయనుంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళలను తమ వైపున ఉండేలా చర్యలు చంద్రబాబు ప్రారంభించారు. అందులో భాగంగా కొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి డిజైన్ తయారయింది. అయితే డ్వాక్రా మహిళల పిల్లల చదువుల కోసం ఈ పధకం ప్రవేశపెట్టనున్నారు. అతి తక్కువ వడ్డేకే డ్వాక్రా మహిళల పిల్లల చదువుల కోసం రుణాలను మంజూరు చేయాలని చంద్రబాబు నిర్ణయంచారు. అయితే ఇందుకోసం ఇంకా విధివిధానాలు పూర్తి స్థాయిలో అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ చంద్రబాబు ఆలోచనలతో త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి. ఈ పథకాన్ని జూన్ 12వ తేదీన ప్రకటించే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.
వారికే అవకాశం...
ఇందుకోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ పరిధిలోని సెర్చ్ బ్యాంకు ద్వారా డ్వాక్రా గ్రూపు మహిళల పిల్లల చదువు కోసం అతి తక్కువ వడ్డీ రేటుకు రుణాలను అందించనున్నారు. నాలుగు శాత వడ్డీ అంటే ముప్ఫయి ఐదు పైసలు మాత్రమే పడుతుంది. దీనిని స్త్రీనిధి ద్వారా అందించనున్నారు. ఒక్కొక్క విద్యార్థికి చదువు కోసం పది వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకూ రుణాన్ని మంజూరు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం డ్వాక్రా మహిళలకు 11 శాతం వడ్డీతో రుణాలు ఇస్తున్నారు. కానీ పిల్లల చదువుల కోసం మాత్రం నాలుగు శాతానికి మాత్రమే ఇస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. ఇక చంద్రబాబు ఆమోదించడమే తరువాయి.
కేజీ నుంచి పీజీ వరకూ...
చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగానే అధికారులు ఈ పథకానికి రూపకల్పన చేయడంతో ఆమోదం పొందడం మామూలుగానే జరిగిపోతుందని, అయితే చిన్నపాటి మార్పులు ఉండే అవకాశముంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ పథకానికి ఎన్టీఆర్ విద్యా సంకల్పంగా నామకరణం చేస్తూ అధికారుల ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఈ పథకం కింద డ్వాక్రా మహిళలకు చెందిన పిల్లలు కేజీ నుంచి పీజీ వరకూ చదువుకునేందుకు వీలుగా పథకాన్ని రూపొందించారు. ఈ తక్కువ వడ్డీ రేటు కింద ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే వారికి కూడా వర్తింప చేయనున్నారని తెలిసింది. అయితే ఈ రుణం మొత్తం పిల్లల చదువుల కోసమే వినియోగించాల్సి ఉంటుంది. ఫీజులు, దుస్తులు, పుస్తకాల కొనుగోళ్లకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందన్న నిబంధనలు పెట్టారు. ఈ పథకం కోసం ఏడాదికి 200 కోట్ల రూపాయలను ఈ పథకం కింద కేటాయించనున్నారు.
Next Story



