Sat Dec 13 2025 19:31:40 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : తుపానులకు .. చంద్రబాబుకు లింకేమిటి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుపానులను సమర్థవంతంగా ఎదుర్కొంటారన్న పేరుంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుపానులను సమర్థవంతంగా ఎదుర్కొంటారన్న పేరుంది. ఆయన మామూలుగానే రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తారు. ఇక విపత్తు సమయంలో ఆయన నిరంతరం అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రజల ప్రాణాలను రక్షించేందుకు నిరంతరం అధికారులకు హెచ్చరికలు చేస్తుంటారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నాలుగు సార్లు ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండుసార్లు, విభజన ఆంధ్రప్రదేశ్ కు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఎక్కువ తుపానులు కూడా రావడంతో వాటిని ఎలా ఎదుర్కొనాలో ఆయన అనుభవం ఆయనకు నేర్పిందని చెప్పాలి.
హుద్ హుద్ వచ్చినప్పుడు...
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1996లో అది పెద్ద విపత్తు సంభవించింది. నాడు కోనసీమ అనేక ఇబ్బందులు పడింది. ఆ పరిస్థితుల్లో ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు. తర్వాత 2014లో అక్టోబరు 12వ తేదీన హుద్ హుద్ తుపాను వచ్చింది. ఈసారి హుద్ హుద్ తుపాను విశాఖపట్నాన్ని ఒక ఊపు ఊపింది. దీంతో చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల పాటు విశాఖపట్నంలో బస్సులోనే ఉంటూ సహాయక చర్యలు చేపట్టారు. హుద్ హుద్ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో నష్టం జరిగింది. విద్యుత్తు స్థంభాలు పడిపోయాయి. చెట్లు విరిగిపడ్డాయి. చంద్రబాబు విశాఖలోనే ఉండి హుద్ హుద్ తుపాను సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించడంతో అధికార యంత్రాంగం తక్కువ సమయంలో విద్యుత్తును పునరుద్ధరించగలిగింది. నీటి సరఫరాను కూడా వెంటనే అందించగలిగింది.
తిత్లీ సమయంలోనూ...
తిత్లీ తుపాను అక్టోబర్ 2018లో వచ్చింది. తిత్లీ తుపాన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర ప్రాంతం ఎక్కువగా నష్టపోయింది. పంటలతో పాటు ఆస్తి నష్టం కూడా ఎక్కువగానే జరిగింది. తిత్లీ తుపాను వల్ల భారీ వర్షాలు, బలమైన గాలులు వీచాయి, దీనితో విస్తృతమైన ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఈ తుపాను తీవ్రంగా ప్రభావం చూపింది. అయినా వెంటనే చంద్రబాబు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి విద్యుత్తు సిబ్బందిని రప్పించి వెను వెంటనే విద్యుత్తును పునరుద్ధరించగలిగారు. తుపాను ను ఆపేశక్తి ఎవరికీ ఉండదు. ప్రకృతి వైపరీత్యానికి ఎవరైనా తలవంచాల్సిందే. అయితే ప్రాణనష్టం జరగకుండా, వెనువెంటనే సహాయక చర్యలు ప్రారంభించడం వల్ల చంద్రబాబు నాయుడు తుపాను సమర్థవంతంగా ఎదుర్కొంటారన్న పేరు వచ్చింది.
గత కొద్ది రోజుల నుంచి...
ప్రస్తుతం మొంథా తుపానును కూడా గత కొద్ది రోజుల నుంచి చంద్రబాబు దగ్గరుండి మానిటర్ చేస్తున్నారు. ఆర్టీజీఎస్ లో కూర్చుని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. విదేశాల్లో ఉండి కూడా తుపాను ముందస్తు సహాయక చర్యల గురించి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అంతేకాదు.. తుపాను ప్రభావిత ప్రాంత జిల్లాలకు ప్రత్యేకంగా నిధులను కూడా విడుదల చేశారు. జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పాటు అవసరమైన నిధులు సమకూర్చడంతో పాటు ముందస్తు చర్యలు తీసుకుంటూ ప్రజల్లో భయాందోళనలు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు గత కొద్ది రోజులుగా తీసుకుంటున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులను ఇన్ ఛార్జులుగా నియమించి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు.
Next Story

