Fri Dec 05 2025 07:15:31 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ఇటుక మీద ఇటుక పెడితే ఇల్లవుతాది.. చంద్రబాబు యాక్షన్ అంటే ఏమవుతాది?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనను ముగించుకుని అమరావతికి చేరుకున్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనను ముగించుకుని అమరావతికి చేరుకున్నారు. కృష్ణా జిల్లాలో నేతల మధ్య విభేదాలపై చంద్రబాబు ఫోకస్ పెట్టే అవకాశముంది. ప్రధానంగా తిరువూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిల మధ్య వివాదం రోడ్డున పడింది. ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడంతో పార్టీని బాగా డ్యామేజీ చేసింది. విదేశాల్లో ఉన్నప్పుడే చంద్రబాబు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఫోన్ చేసి ఎవరినీ పిలిపించి మాట్లాడవద్దని, తాను వచ్చిన తర్వాత ఇద్దరి విషయంలో చర్యలు తీసుకుంటానని చెప్పారు. దీంతో చంద్రబాబు రాకతో ఎవరిపై చర్య చంద్రబాబు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
చర్యలుంటాయా?
అయితే చంద్రబాబు స్టయిల్ ఆఫ్ యాక్షన్స్ దగ్గర నుంచి చూసిన వారికి ఎవరికైనా .. ఎవరిపైనా చర్యలు ఉండే అవకాశాలు ఉండవన్నది ఒక వాదన. ఆయన పార్టీ అధినేతగా ఇప్పటి వరకూ పార్టీ నుంచి సస్పెన్షన్ చేసిన నేతలు చాలా తక్కువ. పార్టీలు మారినప్పుడే వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు తప్పించి, ఇలాంటి వివాదాల విషయంలో ఆయన నేరుగా యాక్షన్ కు దిగే అవకాశం లేదన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై పార్టీ సస్పెన్షన్ వేటు వేయడానికి లైంగిక వేదింపులే కారణం తప్ప పార్టీ విషయంలో రచ్చ కెక్కడం మాత్రం కాదు. ఇప్పుడు తిరువూరు విషయంలోనూ ఇద్దరు నేతలకు హెచ్చరికలతో సరిపెడతారన్నది ఎక్కువ మంది నేతల అభిప్రాయంగా కనిపిస్తుంది.
హెచ్చరికలతో వదిలేస్తారా?
ఎందుకంటే ఇద్దరు నేతలు.. సామాజికవర్గం పరంగా చూస్తే గట్టి వారే. ఇటు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు దళిత వర్గానికి చెందినవారు. ఆయనపై చర్య తీసుకుంటే అది తప్పుడు సంకేతాలు వెళతాయని చంద్రబాబు భావించే అవకాశాలున్నాయి. ఇప్పటికే పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్న కొలికపూడి శ్రీనివాసరావును హెచ్చరించి పంపారు తప్పించి చర్యలకు దిగకపోవడాన్ని కొందరు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కూడా యాక్షన్ ఇలాగే ఉంటుందని అంటున్నారు. ఇక విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కృష్ణా జిల్లాలో బలమైన సామాజికవర్గానికి చెందిన వారు కావడం, అందులోనూ ఆయన ఎంపీగా ఉండటంతో ఆయనకు కూడా హెచ్చరికలతో సరిపెడతారంటున్నారు. చంద్రబాబు కేవలం ప్రకటనల్లో మాత్రమే సస్పెన్షన్ అంటూ హెచ్చరిస్తారని, చేతలకు వచ్చేసరికి కమిటీ వేసి ఆ వివాదం సమసిపోయేలా చేయడంలో దిట్ట అని సీనియర్ నేతలే అంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు దృష్టి పెట్టి తిరువూరు సమస్యకు చెక్ పెట్టే అవకాశాలున్నాయి. అంతే తప్ప యాక్షన్ కు దిగే అవకాశాలు మాత్రం లేవన్నది వాస్తవం.
Next Story

