Fri Jan 09 2026 23:37:11 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : చంద్రబాబును ముంచేది ఈ ముగ్గురేనా?
చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు సొంత సామాజికవర్గంలోనే శత్రువులు ఎక్కువయ్యారు

చంద్రబాబు నాయుడుకు ఇప్పుడు సొంత సామాజికవర్గంలోనే శత్రువులు ఎక్కువయ్యారు. ప్రత్యర్థులు చేసే విమర్శలను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు. కానీ సొంత సామాజికవర్గం నేతలే చంద్రబాబు ప్రతి నిర్ణయాన్ని తప్పపడుతుండటం ఆయనకు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెడుతుందనే చెప్పాలి. ఒకరకంగా చంద్రబాబు నాయుడుకు బయట శత్రువులతో కంటే ఇంట్లో శత్రువులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఈసారి కనిపిస్తుంది. ప్రధానంగా ఈసారి మాత్రం కమ్మ సామాజికవర్గం నేతలు మాత్రమే ఆయనను రాజకీయంగా ఇరకాటంలోకి నెడుతున్నారని చెప్పాలి. అందులో ప్రధానంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు, ఏబీ వెంకటేశ్వరరావు, ముప్పవరపు వెంకయ్య నాయుడులు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు ఇబ్బందికరంగా మారాయి.
వడ్డే వ్యాఖ్యలతో...
వడ్డే శోభనాద్రీశ్వరరావు మాజీ టీడీపీ నేత. చంద్రబాబు మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు రాజకీయంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితేనేం రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. చంద్రబాబు వ్యతిరేక మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా వడ్డే ఇంటర్వ్యూలతో చెలరేగిపోతున్నారు. చంద్రబాబు రాజధాని పేరిట రైతులను నిలువునా ముంచుతున్నారంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. తొలిదఫా ల్యాండ్ పూలింగ్ కు ఇచ్చిన రైతులు ఇబ్బందులను చూసైనా రెండో విడత భూ సమీకరణకు సహకరించవద్దంటూ రైతులకు వడ్డే శోభనాద్రీశ్వరరావు పిలుపు నిస్తున్నారు. పచ్చని పంటలు పండే భూములను సర్వనాశనం చేస్తున్నారని, కలల్లో చంద్రబాబు విహరిస్తున్నారని ఫైర్ అవుతున్నారు. మరో ఎయిర్ పోర్టు, మరో ఆరులేన్ల రహదారి అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు.
ఏపీ వదలడం లేదుగా...?
ఇక ఏబీ వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పడు ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. తర్వాత పదవీ విరమణ చేశారు. కానీ ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద పదవి వస్తుందని ఏబీ వెంకటేశ్వరరావు భావించారు. పోలీసు కార్పొరేషన్ ఛైర్మన్ గా నియమించారు. దానిని తీసుకునేందుకు ఏబీ వెంకటేశ్వరరావు ఇష్టపడలేదు. పైగా రాష్ట్రంలో కొత్త పార్టీ పెడతానని చెబుతున్నారు. అలాగే యాభై వేల ఎకరాలు తొలి విడత సేకరించిన భూమిని ఎవరెవరికిచ్చారో లెక్కలు చెప్పాలంటూ ఏబీ వెంకటేశ్వరరావు మీడియా ద్వారా నిలదీస్తున్నారు. ఇది కూడా చంద్రబాబుకు ఇబ్బందికరమే. ఇక మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇటీవల మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణను తప్పుపట్టేలా మాట్లాడటం కూడా బాబు సర్కార్ ను ట్రబుల్ లోకి నెట్టింది. విద్య, వైద్యం మాత్రం ఉచితంగా పేదలకు అందించాలని, మిగిలిన పథకాలను రద్దు చేయాలంటూ వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు జగన్ తో పాటు చంద్రబాబుకు కూడా తగిలినప్పటికీ ఎక్కువ డ్యామేజీ చంద్రబాబుకే నంటున్నారు. అలా ఈ ముగ్గురు చేస్తున్న వ్యాఖ్యలు చంద్రబాబుకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి
Next Story

