Mon Nov 17 2025 09:35:42 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu : ప్రతిపక్షంలోనే ఇక ఉండరా? విపక్ష పార్టీలకు ఆశలు లేవా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. కూటమితో మరికొన్నేళ్ల పాటు తమకు తిరుగులేని విజయం దక్కుతుందని ఆయన భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు నిన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో టీడీపీ ఇక ఎప్పడూ ప్రతిపక్షంలో ఉండదని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా ఇలాంటి ఆలోచనలు రావడం సహజం. ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండటంలో తప్పులేదు. అలాగని అతి విశ్వాసానికి పోతే గెలిపించేది ప్రజలు అని గుర్తుంచుకోవాలన్నది అందరూ గమనించుకోవాలి. గత ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కూడా వైసీపీ ముప్ఫయి ఏళ్ల పాటు అధికారంలో కానసాగుతుందని చెప్పారు. మొన్నటి ఎన్నికలలో ఏమైంది?
దేశంలో ఎక్కడ చూసినా...
కేవలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే కాదు.. పొరుగున ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అదే ధీమాతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తనను ప్రజలు శాశ్వతంగా తననే ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారని భావించారు. పదేళ్ల తర్వాత ఫాం హౌస్ కు పరిమితం చేశారు. ఇక ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఐదు సార్లు ముఖ్యమంత్రిగా గెలిచినా సరే.. చివరకు మొన్నటి ఎన్నికల్లో ఆయనను ఇంటికి పంపారు. ఇలాంటి ఉదాహరణలు దేశంలో ఎన్నో ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉండదని చంద్రబాబు అనడం నేతల్లోనూ, క్యాడర్ లోనూ ఆయన ఉత్సాహంతో పాటు జోష్ పెంచేందుకే అయినా ఎవరూ రాజకీయాల్లో అధికారంలో ఉండటం శాశ్వతంగా ఉండదని దేశంలోనే అనేక రాష్ట్రాల్లో చూసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఆల్ ఈజ్ వెల్ అనుకుంటే...
కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఏర్పడిన తర్వాత అంతా బాగుందని అనుకుంటే పరవాలేదు కానీ.. పూర్తిగా తమకు అనుకూలంగా ఉందని భావించడం మాత్రం చంద్రబాబు అతి విశ్వాసానికి నిదర్శనమనే చెప్పాలి. కూటమి అనేది కలిసి ఉండొచ్చు. ఉండకపోవచ్చు. అలాగే కూటమిలో ఉన్న పార్టీలపై జనాలకు మొహం మొత్తే అవకాశం కూడా ఉంది. చంద్రబాబు యాభై ఏళ్ల రాజకీయ అనుభవంతో ఆయన ఇక ప్రతిపక్షంలో ఉండదని చెప్పడాన్ని మాత్రం పార్టీ నేతలే నవ్వుకుంటున్నారు. అధికారం ఎవరికీ శాశ్వతమని భావిస్తే అదే ఓటమికి ప్రధాన కారణమవుతుందని కూడా అనేక విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఆల్ ఈజ్ వెల్ అనుకున్న వారంతా రాజకీయాల్లో కనుమరుగైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు.
Next Story

